11-01-2026 01:20:52 AM
ఇరాన్ మహిళల వినూత్న నిరసన
టెహ్రాన్, జనవరి 10: ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి పౌరులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. రెండు వారాల నుంచి పౌరులు రోడ్లమీదకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా కొందరు మహిళలు ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చిత్రపటాలను దహనం చేస్తున్నారు. కొందరు మహిళలైతే అక్కడితో ఆగకుండా ఆ మంటల్లో సిగరెట్లు వెలిగించుకుంటున్నారు.
ఇరాన్ చట్టాల ప్రకారం సుప్రీం లీడర్ ఫోటోను అవమానించడం తీవ్రమైన నేరం. దీనికి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అలాంటి చట్టాలు అమలయ్యే దేశంలో మహిళలు ఇలాంటి నిరసనలు వ్యక్తం చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్థిక సంక్షోభమే నిరసనలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇరాన్ కరెన్సీ విలువ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
నెత్తురోడుతున్న ఇరాన్
ఇరాన్‌లో పౌరుల నిరసలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. భద్రతా బలగాలు క్రూరంగా పౌరులపై విరుచుకుపడుతున్నాయి. బాష్పవాయువులు, రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ కాకుండా కాల్పులకూ తెగబడుతున్నది. ఆ దాడుల్లో వంద లాది మంది మృతిచెందారు. ఒక్క టెహ్రాన్‌లోని ఆరు ఆసుపత్రుల్లోనే 217 మృతదే హాలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మృతుల్లో అత్యధికులు యువకులేనని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నది. ఇజ్రాయెల్‌తో గతంలో జరిగిన యుద్ధం కారణంగా ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా, సైనికంగా బలహీనపడింది. దీనికి తోడు అంత ర్జాతీయ ఆంక్షలు, కరెన్సీ పతనం ప్రజల్లో తీవ్ర అసహనాన్ని పెంచాయి. దీంతో ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకునేందుకు హింసామార్గాన్ని ఎంచుకుంది.