calender_icon.png 10 May, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త దుమారం

16-04-2025 01:29:40 AM

ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిపై కేసులు

  1. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కూల్చమంటున్నారు..
  2. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పోలీసులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

సిద్దిపేట/మెదక్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కూల్చమంటున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆయనపై రాజద్రోహం కింద చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్, రాయపోల్, మెదక్ జిల్లాలోని చేగుంట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్‌ఎస్ కార్యకర్తలతో సోమవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఖర్చును తాము భరిస్తామంటున్నారని వ్యాఖ్యానించారు.

పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని మాట్లాడారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిం దని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నని జోస్యం చెప్పారు. రాజకీ యాల్లోకి వచ్చాక సిన్సియర్‌గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు.

ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, రాయపోల్, మెదక్ జిల్లా చేగుంట, నార్సింగిలలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేను నియోజకవర్గంలో ఎక్కడికి అక్కడ అడ్డు కుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మంగళవారం దౌల్తాబాద్‌లో అంబేద్కర్ విగ్ర హం వద్ద బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కారుకు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు తిరగగా పోలీసులు కలగజేసుకొని అక్కడి నుంచి పంపించేశారు.

దౌల్తాబాద్ లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య, మండల ఉపాధ్యక్షుడు స్వామి, ఎస్సీ సెల్ మం డల అధ్యక్షుడు బండారు లాలు, నాయకులు రమేష్, సంపత్‌రెడ్డి, కిష్టారెడ్డి, నర్సింలు, భద్ర య్య, ఎల్లయ్య, ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చేగుంటలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, మండల కో ఆర్డినేటర్ జనగామ మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ కొండి శ్రీని వాస్, ఓబీసీ అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు, నాయకులు సండ్రుగు శ్రీకాంత్, దుబ్బాక యూత్ ఉపా ధ్యక్షుడు సాయికుమార్‌గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు మోహన్‌నాయక్, బాలరెడ్డి, బాస రా జు, సబ్బనిశ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి

  1. ధరణిలోని బీఆర్‌ఎస్ నేతల బినామీ భూములు బయటకు వస్తాయని భయం..
  2. దమ్ముంటే ఎంత మంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రె స్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారన్న మాటలపై కాంగ్రెస్ నేతలు భగ్గు మన్నారు. నోవాటేల్ హోటల్ వద్ద మంగళవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు.

తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరగుతోందని, ఆ కుట్ర లో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారని.. ప్రజా బలం లేని బీఆర్‌ఎస్ వేల కోట్లతో రాజకీయం చేయాలని చూస్తోందని మంత్రి ధ్వజమెత్తారు.

ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచనేనని.. కేసీఆర్ నోటివెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్‌రెడ్డి నోట వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆత్మనే కొత్త ప్రభాకర్ రెడ్డి అని మంత్రి పేర్కొన్నారు.  ధరణిలో లబ్ధిపొందిన బీఆర్‌ఎస్ బినామీలే ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి చెప్పారన్నారు.

భూభారతి రావడంతో అక్రమంగా భూములు పొందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, భారతితో కొల్లగొట్టిన భూములన్నీ వెనక్కి తిరిగోస్తాయనే భయంతో ఈ వ్యాఖ్యలు చేశారని మంత్రి పొంగులేటి  అన్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండని మంత్రి పొంగులేటి సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని కుల్చే కుట్రలు జరిగితే కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హెచ్‌సీయూ భూముల అక్రమార్కులకు కట్టబెట్టాలని బీఆర్‌ఎస్ చూస్తోందని ఆరోపించారు. అందుకోసమే ఇలాంటి కుట్రలకు తెరలేపుతోందని, ఎన్ని కుట్ర లు కుతంత్రాలు చేసినా, భూ భారతి అమలు చేస్తామన్నా రు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఇలాం టి చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ కు ప్రజా బలం ఉందని స్పష్టం చేశారు.

ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదు: మంత్రి పొన్నం

కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం సెటైరికల్ కౌంటర్ వేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిది ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం అనుకున్నా.. కానీ ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెబుతున్నారని విమర్శించారు. మీరు ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. పడగొట్టుదాం రండీ అంటే పోవడానికి ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

విచారణ జరిపించాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

దుబ్బాక ఎమ్మెల్యే ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి  ప్రభుత్వ  విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ కిరణ్ కుమా ర్‌రెడ్డి  విజ్ఞప్తి  చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎంను కోరుతామన్నారు.

కుట్ర కోణం ఉన్నట్లయితే చట్టపర మైన చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్ కోరారు. బీఆర్‌ఎస్ నాయ కులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈర్ష్య ఎందుకని ఆది శ్రీనివాస్ ప్రశ్నిం చారు. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటున్నారని, మరో ఐదేళ్లు కూడా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

నార్కో టెస్ట్ చేయించాలి : అద్దంకి దయాకర్

కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేపించాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నా రు. విచారణ చేయించి.. నిజాలు చెప్పించాలని సీఎంను కోరారు. బీజేపీతో కలిసి గుజరాత్ వ్యా పారులతో కుమ్మక్కై బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని, సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది మాట్లాడ్తున్నారని ఆరోపించారు.