కల్తీకల్లు దుకాణాలను మూసివేయాలి
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్ రూరల్, ఆగస్టు (విజయక్రాంతి): ఇటీవల కల్తీకల్లు తాగి అస్వస్థకు గురై వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కల్తీ కల్లును పూర్తిగా నిషేధించాలని, అనుమతి లేకుండా కొనసాగుతున్న కల్లు దుకాణాలను వెంటనే మూసివేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. కాగా కల్లీకల్లు తాగి దుర్గయ్య చనిపోయాడని అతడి బంధువులు ఆరోపించగా.. బాధితులకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయనవెంట నాయకులు వడ్ల నందు, శ్రీధర్ రెడ్డి, శ్రీకాం త్ రెడ్డి, నరోత్తం రెడ్డి, బస్వలింగం ఉన్నారు.
కల్లు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించాం
పీరంపల్లి గ్రామంలో సంబంధిత కల్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.విజయ భాస్కర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పీరంపల్లిలో కల్తీ కల్లు తాగి కొంతమంది అనారో గ్యానికి గురైన సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బందిని గ్రామానికి పంపించి కల్లు శాంపిల్స్ తీసుకున్నామన్నారు. కల్తీకల్లు తాగితే ఒకరోజు మాత్రమే అస్వస్థతకు గురవుతారని.. నాలుగు రోజులుగా అస్వస్థతకు గురికావడంతో ఇతర కారణాలు ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, అలాంటిదే ఉండవచ్చునని తెలి పారు. సదరు కల్లు దుకాణదారుడిపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలో అస్వస్థకు గురైన వారు క్రమంగా కోలుకుంటుంన్నారని భాస్కర్ గౌడ్ తెలిపారు. గ్రామంలో కేసులు పూర్తిగా తగ్గేంత వరకు మెడికల్ క్యాంపు కొనసాగుతుందని తెలిపారు.






