11-12-2025 12:24:46 AM
స్టార్ హీరో కార్తి నటిస్తున్న చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ చిత్రాన్ని యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను కథానాయకుడు కార్తి విలేకరులతో పంచుకున్నారు.
డైరెక్టర్ నలన్ కుమారస్వామి ‘సూదు కవ్వమ్’ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం ఎదురుచేస్తున్నారు.
సూపర్ హీరో అంటే బ్యాట్స్‌మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం. కానీ మన సంస్కృతిలోనూ ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోలు ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్‌ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా ఇది. 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను గుర్తుచేస్తూ, కాల్పనిక ప్రపంచంలో జరిగే కథ ఇది.
ఈ సినిమా సవాలుతో కూడుకున్న ప్రయత్నం. రచయితకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్‌తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే, ఈ సినిమాను ఎంతో ఉత్సాహంగా చేశాను.
హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్.. ఇలా ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి.. ప్రపంచంలో మరెక్కడా చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షి యల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్‌గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ప్రేక్షకులను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా ఉంటుంది.
నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్‌లో అక్కడి సినిమాలు ఇక్కడ.. ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాస్ ఓవర్ వల్ల ఆ మహా నటుల కెరీర్‌లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు. డైరెక్టర్ నలన్ గత సినిమాలు సాడ్ ఎండింగ్‌తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్‌గా ఉంటుంది.
నేను గతంలో సీరియస్, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చేశాను. ఇందులోనూ పోలీస్ పాత్రే కానీ, దర్శకుడు దీన్ని ఎంతో విభిన్నంగా డిజైన్ చేశారు. కృతిశెట్టి ఇందులో స్పిరిట్ రీడర్‌లా కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా రీసెర్చ్ చేసి, ప్రిపేర్ అయింది. కొత్త తరహా సినిమా ఎవరు చేసినా ప్రోత్సహించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు.