5 March, 2026 | 4:53 AM

ఫైనల్లో న్యూజిలాండ్

05-03-2026 01:31 AM

సెంచరీతో ఫిన్ అలెన్ విధ్వంసం

సెమీస్‌లో సౌతాఫ్రికా చిత్తు

కోల్‌కత్తా, మార్చి 4 : టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఫిన్ అలెన్ సెంచరీతో రెచ్చిపోయిన వేళ, మరో ఓపెనర్ సిఫెర్ట్ సైతం హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించడంతో మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది.

ఫిన్ అలెన్ విధ్వంసానికి న్యూజి లాండ్ మరో 7.1 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్‌ను అందుకుంది. దీంతో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా ఈ సారి సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకుంది. డికాక్ (10), మార్క్ రమ్ (18), రికెల్టన్ (0), డేవిడ్ మిల్లర్ (6) పరుగులకే ఔటయ్యారు. దీంతో సౌతాఫ్రికా 77 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుం ది. కనీసం 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు కూడా నెలకొన్నాయి.

ఈ పరిస్థితుల్లో బ్రెవిస్  34 పరుగులకు ఔటవగా.. స్టబ్స్, మార్కో యెన్సన్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 73 పరుగులు జోడించారు. స్టబ్స్ 29 (2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు వెనుదిరగ్గా... యెన్సన్ మాత్రం దూకుడుగా ఆడాడు. కివీస్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. యెన్స న్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది.

కివీస్ బౌలర్లలో హెన్రీ 2, మెకన్నీ 2, రచిన్ రవీంద్ర 2 వికెట్లు పడగొట్టారు.170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి బంతి నుంచే దుమ్మురేపింది. ఓపెనర్లు సిఫెర్ట్ , ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసేసారు. పవర్ ప్లేలో వీరిద్దరి విధ్వంసానికి కివీస్ వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. వీరిద్దరి విధ్వంసక బ్యాటింగ్‌కు సఫారీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో సిఫెర్ట్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది.

తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఫిన్ అలెన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయం కోసం 21 పరుగులే చేయాల్సి ఉండగా.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడంతో అతని సెంచరీ కూడా పూర్తయింది. ఫిన్ అలెన్ శతకం కేవలం 33 బంతుల్లోనే పూర్తి చేసుకోవడం ద్వారా వరల్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సృష్టించాడు. దీంతో కివీస్ 12.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 170 పరుగుల టార్గెట్ ను అందుకుంది.