వ్యానుపై బోల్తాపడిన సిమెంట్ ట్రక్కు.. తొమ్మిది మంది స్పాట్ డెడ్
ఝుబువా: మధ్యప్రదేశ్ రాష్ట్రం(Madhya Pradesh) ఝుబువా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమెంట్ బస్తాలతో వెళ్తూ అదుపుతప్పిన ట్రైలర్ ట్రక్కు వ్యానుపై బోల్తా పడింది. వ్యానుపై సిమెంట్ బస్తాలు పడటంతో తొమ్మది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన బాధితులు వివాహ కార్యక్రమం నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
మేఘనగర్ తహసీల్(Meghnagar Tehsil) ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్(Sanjeli Railway Crossing) సమీపంలోని తాత్కాలిక రహదారి ద్వారా నిర్మాణంలో ఉన్న రైలు ఓవర్ బ్రిడ్జి (Road Over Bridge)ని ట్రక్కు దాటుతుండగా, బ్యాలెన్స్ తప్పి వ్యాన్‌పై బోల్తా పడి ట్రక్కు బరువు కింద నలిగిపోయిందని ఝుబువా పోలీసు సూపరింటెండెంట్ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.






