బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ బాధ్యతలు
- ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రుల సమక్షంలో..
- ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- కార్యకర్తలతో భుజం భుజం కలిపి పనిచేస్తా: నితిన్ నబిన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన తన క్యాబిన్‌లో ఆశీనులయ్యారు.
ఆయనకు కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. నితిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీకి చేరుకోకముందు నితిన్ నబిన్ బీహార్ రాజధాని పాట్నాలోని మహా ఆలయాన్ని సందర్శించారు. తన ఇష్టదైవానికి పూజలు చేశారు.
అనంతరం నగరంలోని తన తండ్రి నబిన్‌కిషోర్ ప్రసాద్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ‘మా నాన్న ఆశయ సాధన కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాన్న బీజేపీని తల్లిగా భావించారు. దేశాన్ని అమితంగా ప్రేమించారు. ఆయన ఆకాంక్షల మేరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దేశానికీ, నా పార్టీకి సేవ చేస్తాను’ అని పేర్కొన్నారు.
భుజం భుజం కలిపి పనిచేస్తా..
బాధ్యతలు స్వీకరించిన తర్వాత నితిన్ నబీన్ మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. అలాంటి గొప్ప పార్టీకి నేను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఆనందాన్నిచ్చింది. పదవి అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ అగ్రనాయకత్వానికి ధన్యవాదాలు. పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తాను. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాను. యువ క్యాడర్‌ను పెంచుతాను. కార్యకర్తల భుజం భుజం కలిపి పనిచేస్తా’నని పేర్కొన్నారు.
రాజకీయ నేపథ్యం
కాయస్థ సామాజికవర్గానికి చెందిన నితిన్ నబీన్ బాంకీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్‌గఢ్ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేశారు.
అక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్యభూమిక పోషించారు. నితిన్ 26 ఏళ్ల వయస్సుల్లోనే రాజకీయాల్లోకి వచ్చారు. ౨006లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎప్పుడూ ఓటమి చవిచూడలేదు. తాజా బీహార్ ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎన్నో సవాళ్లు
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్‌కు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. జాతీయస్థాయిలో కొత్త కార్యవర్గాన్ని సిద్ధం చేయడం ఆయన ముందున్న ముఖ్యమైన సవాల్. ఈ క్రమంలో ఆయన సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకుంటారా.. లేదా, యువ నాయకత్వానికి ప్రాధాన్యమిస్తారా.. అన్నది మున్ముందు చూడాల్సి వుంది. ఆయన ఒకవైపు బీహార్ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు పార్టీ పరమైన పనులు చేపట్టాల్సి వుంటుంది.
అలాగే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బాంకీపూర్ నియోజకవర్గ అభివృద్ధికీ కృషి చేయాల్సి వుంటుంది. ఏకకాలంలో ఆయన అన్నిరకాల బాధ్యతలు నిర్వర్తిస్తారా.. పార్టీలో నెగ్గుకు వస్తారా.. అనే ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది. అలాగే కొద్దినెలల్లోనే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీకి ఆ ఎన్నికలు టగ్ ఆఫ్ వార్ అనే చెప్పాలి.
ఆ ఎన్నికల్లో నితిన్ నబీన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనేది పార్టీ దృష్టి పెట్టిన అంశం. అలాగే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సేవలందిన వారు తర్వాత, పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా, మునుపు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసే వారు కావడం గమనార్హం. అన్ని సజావుగా జరిగితే నబిన్ కమళ దళ సారథి అయ్యే అవకాశమూ ఉంది.




