29 June, 2026 | 2:55 AM

టార్గెట్ అధికారమే!

29-06-2026 01:55 AM
  1. విభేదాలు పక్కన పెట్టాలి
  2. తెలంగాణలో అధికారానికి అవకాశాలు పుష్కలం
  3. నెలరోజుల్లో ఆ వాతావరణం క్రియేట్ చేయాలి
  4. అప్పుడు హైకమాండ్ ఏం చేయాలో అది చేస్తుంది
  5. క్షేత్రస్థాయిలో సమస్యలపై ఫైట్ చేయండి
  6. కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి
  7. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నితిన్ నబీన్ దిశానిర్దేశం

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెంలగాణపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టిందని, అధికారంలోకి వచ్చేలా పార్టీ నాయకులంతా కష్టపడాలని బీజేపీ ముఖ్యనాయకులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. నాయకులందరూ విభేదాలను పక్కనపెట్టి, కష్టపడి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణలో మీపై ఎంతో బాధ్యత ఉందని, రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు.

ఎవరో వస్తారని ఎదురు చూడటం కాదు.. ముందు నెల రోజుల్లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని, ఆ తర్వాత హైకమాండ్ నుంచి ఏం చేయాలో అది చేస్తామని బీజేపీ నాయకులతో నితిన్ నబీన్ చెప్పినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్యనాయకులతో నితిన్‌ నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహా లు, సర్, మున్సిపల్ కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికలు, ప్రజా సమస్యల పోరాటాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి నాయకులంతా సమన్వయంతో పార్టీని అధికారంలోకి తెచ్చేందు కు పనిచేయాలని మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఉండి సమస్యలపై పోరాటం చేయాలని, తాను గతంలో తెలంగాణలో తిరిగానని, తనకు ఇక్కడి రాజకీయ పరిస్థితులు, సమస్యలపై అవగాహన ఉందన్నారు.

అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని, ఈ తేదీ గుర్తు పెట్టుకోవాలని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇది గుర్తు చేసుకోవాలన్నారు. పలువురు నాయకుల పనితీ రుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవ్వరైనా సరే.. వ్యక్తిగత ఇమేజ్‌ని పక్కనబెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే కష్టపడాలన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల విస్మరణపై చట్ట సభలతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం.

మోదీ 12 ఏళ్ల పాలనను ప్రజల్లోకి..

నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆయన తీసుకున్న సాహోసపేతమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి వివరించాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, మున్సిపల్, స్థానిక.. ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీజేపీదే ఉండేలా కష్టపడాలన్నారు. ముఖ్యంగా నేతల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. త్వరలో జరిగే మూడు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుక సాగాలని నేతలతో ఆయన చెప్పినట్లు సమాచారం.