20 June, 2026 | 2:04 AM

నెలాఖరులో రాష్ట్రానికి నితిన్ నబిన్

20-06-2026 12:52 AM
  1.   28,29,30 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ  సమావేశాలు
  2. హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు  
  3. మూడు రోజులు ఇక్కడే మకాం
  4. కార్పొరేషన్ ఎన్నికలపై క్యాడర్‌కు దిశానిర్దేశం! 

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నెలాఖరులో తెలంగాణకు రానున్నారు. 28, 29, 30వ తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ యన పాల్గొంటారు. మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. నిర్వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు హాట్ టాపిక్‌గా మారాయి.  కేడర్‌లో జోష్ నింపేందుకు ఈసమావేశాలను ఒకే చోట కాకుండా, మూడు ప్రధాన కేంద్రాల్లో నిర్వహించేలా ప్లాన్ చేశారు. 

మూడు వేదికల్లో సమావేశాలు

హైదరాబాద్, వరంగల్, యాదాద్రి వేదికలుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జర గనున్నాయి. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కార్పొరేషన్ ఎ న్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతంపై ఈ వేదికల నుంచి క్యాడర్‌కు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, రాష్ట్ర నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

జాతీయ అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల యాక్షన్ ప్లాన్‌ను పర్యవేక్షించనుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.  కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా, పలు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన బీజేపీ కార్యాలయాలను కూడా నితిన్ నబిన్ ప్రారంభించనున్నారు. బూత్ కమిటీల బలోపేతం, సోషల్ మీడియా యాక్టివిటీని పెంచ డం ద్వారా కేడర్‌లో పూర్తిస్థాయి జోష్ నింపునున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో  ఎన్నికల వ్యూహాలే కాకుండా, రాష్ట్రంలో రాజకీయ, సామాజిక పరిస్థితులపైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికలు రచించే అవకాశముంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవ లంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్యలు, రైతులకు సంబంధించిన పెండింగ్ హామీలపై పోరాటానికి స్పష్టమైన కార్యాచరణను తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఇతర పార్టీల్లోని కీలక నాయకులను బీజేపీలోకి చేర్చుకోవడంపైనా కసర త్తు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది.