రోడ్డు భద్రతపై రాజీ లేదు..
సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, జులై 22 (విజయ క్రాంతి) : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులపై భద్రతా చర్యలను కఠినతరం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహలు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, 4 నెలల్లోగా ఎల్‌ఈడీ లైట్లు, స్పీడ్ కెమెరాలు, రిఫ్లెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హైవేల ప్రధాన రోడ్లు, షోల్డర్స్పై భారీ వాహనాలను పార్క్ చేయడంపై పూర్తి నిషేధం విధించామని, కేవలం నిర్దేశిత లే-బై ప్రాంతాలు లేదా పెట్రోల్ బంకుల్లోనే నిలపాలన్నారు. నిబంధనలు మీరితే ఈ-చలానాలు, జీపీఎస్ ఫోటో ఆధారాలతో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే హైవేల పక్కన ఉన్న అక్రమ దాబాలు, హోటళ్లు, ఆక్రమణలను డ్రోన్ సర్వేల ద్వారా తొలగించాలని, పాత అనుమతులను 30 రోజుల్లోగా సమీక్షించాలని తెలిపారు.
ప్రమాద బాధితులకు ప్రతి 75 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచి, ట్రామా కేర్ సెంటర్లలో రూ.1.5 లక్షల వరకు ఉచిత/నగదు రహిత వైద్యం అందించాలని సూచించారు. రోడ్డు భద్రత అమలు తీరుపై ప్రతి 15 రోజులకోసారి ప్రత్యేక టాస్క్ ఫోర్స్తో రివ్యూ నిర్వహిస్తామని, నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వ్యక్తిగత చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ ప్రేమ్రాజ్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఆర్టీవో పురుషోత్తం రెడ్డి, డీపీఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






