23 July, 2026 | 1:52 AM

వైద్య పరిశోధనలకు ములుగులో అత్యాధునిక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన

23-07-2026 12:00 AM
  1. కలెక్టర్‌ను కలిసిన ఎయిమ్స్ బీబీనగర్ డీన్ 
  2. గిరిజనులకు ఆరోగ్య సేవలు, వైద్యరంగంలో పరిశోధనల బలోపేతం
  3. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, జులై 22 (విజయ క్రాంతి) గిరిజన ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలను మరింత బలోపేతం చేసే దిశగా ములుగు జిల్లాలో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును ఆయన ఛాంబర్లో బీబీనగర్ ఎయిమ్స్ డీన్ రిసెర్చ్ డా. రాహుల్ నరాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి,

ములుగు జిల్లాలో సమ్మక్కసారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో ‘సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్‘ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చించింది.ఈ సందర్భంగా ప్రతిపాదిత కేంద్రం లక్ష్యాలు, గిరిజన ఆరోగ్య సేవల బలోపేతం, వైద్య పరిశోధనలు, అకడమిక్ సహకారం, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.nఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదిత కేంద్రం ద్వారా గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయడం, తలసీమియా, రక్తహీనత, టెలీమెడిసిన్ సేవలను విస్తరించడం,

సికిల్ సెల్ అనీమియా, మలేరియా, డెంగ్యూ, క్షయవ్యాధి, స్క్రబ్ టైఫస్, జునోసిస్ వ్యాధుల వంటి, గిరిజన ప్రాంతాల్లో అధికంగా కనిపించే వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహించడం, గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం, గిరిజన యువతకు ఆరోగ్య విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందించడం, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ కల్పించడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో వ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తరించడం, ఎయిమ్స్ బీబీనగర్‌సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో వైద్య సేవలు,

అకడమిక్ కార్యక్రమాలు, పరిశోధనలను విస్తరించే కార్యాచరణను రూపొందించడం ద్వారా ములుగు జిల్లాను గిరిజన ఆరోగ్య సేవలు, వైద్య పరిశోధనలు, ప్రజారోగ్య అధ్యయనాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డీఎంహెచ్వో డా. గోపాలరావు, ములుగు ఏరియా ఆసుపత్రి, ఏటూరునాగారం ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డా. చంద్రశేఖర్, డా. సురేష్, ఎయిమ్స్ వైద్య బృందం సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.