రైతు ఏడ్చిన ఏ రాజ్యం బాగుపడలే
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్, మే 3 : గొడ్డు ఏడ్చిన ఏ దొడ్డి బాగుపడలేదాని, రైతు ఏడ్చిన ఏ రాజ్యం బాగుపడలేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించి రైతుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వ్యవహారంలో తీవ్ర జాప్యం చేస్తూ రైతులను నయవంచనకు గురిచేస్తోందన్నారు.
మండుతున్న ఎండలో రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణమన్నారు. ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చి 30 రోజులు గడిచినా తూకాలు వేయకపోవడం, అరకొరగా కొనుగోలు చేయడం, తాలు పేరుతో క్వింటాకు 8 కిలోల వరకు కోత విధించడం ద్వారా రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ యంత్రాల లోపాలు, సిబ్బంది కొరత కారణంగా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు.
అధికారులను నిలదీస్తూ తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తూకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. రైతులకు తాగునీరు, నీడ, విశ్రాంతి కోసం షెడ్లు,సదుపాయాలు వంటి కనీస సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా సమయానికి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని, మధ్యవర్తుల జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంతం గానీ, రైతుల సమస్యలు గానీ పట్టించుకోవడం లేదని, రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకోవడం తప్ప రైతుల కోసం ఎప్పుడూ పోరాడలేదని తీవ్రంగా విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం కొనసాగితే పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన రైతులను పిలిచి 5000 మందితో మహా ధర్నా చేస్తానన్నారు. నేను వెంట పలువురు రైతులు ఉన్నారు.






