ఆరోగ్య మిషన్ బకాయిలు విడుదల చేయండి
రూ.693.13 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది
అక్టోబర్ నుంచి కేంద్రం వాటా కూడా మేమే చెల్లిస్తున్నాం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 25 ( విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగళవారం సీఎం కలిసి వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను వివరించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నింటినీ తాము ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగాను రూ.5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) సమర్థంగా నిర్వహిస్తున్నామని నడ్డాకు రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్రం కూడా సహకరించాలని, ఎన్‌హెచ్‌ఎం బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఎన్‌హెచ్‌ఎం 2023 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.138 కోట్లు మంజూరు చేయాల్సి ఉందని, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. ఎన్‌హెచ్‌ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో ఆత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన మొత్తాన్ని 2023 ఆక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నట్లు కేంద్రమంత్రి దృష్టికి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు.






