ఎంపాక్స్‌పై భయం వద్దు: డబ్ల్యూహెచ్‌వో
న్యూఢిల్లీ, ఆగస్టు 20: కరోనా రక్కసి పీడ పూర్తిగా విరగడ కాక ముందే మానవాళిని మరో భూతం ఎంపాక్స్ రూపంలో భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని డబ్ల్యూహెచ్‌వో కూడా అప్రమత్తం అయింది. అయితే తాజాగా డబ్ల్యూహెచ్‌వో చెప్పిన మాటలు అందరికీ కాస్త రిలీఫ్ ఇచ్చాయి. ఎంపాక్స్ వైరస్ కరోనాలా కాదని ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించ్చొచని డబ్ల్యూహెచ్‌వో పేర్కొం ది. డబ్ల్యుహెచ్‌వో యూరప్ రీజినల్ డైరెక్టర్ హాన్స్ క్లుగే మీడియాతో మాట్లాడుతూ... “ఎంపాక్స్‌ను కలిసికట్టుగా ఎదుర్కోవాలి.
మనం ఈ వైరస్‌ను నియంత్రిస్తామా.. మరోసారి నిర్లక్ష్యం చేస్తామా అనేది మనమీదే ఆధారపడి ఉంటుంది. రానున్న రోజుల్లో ఐరోపాతో పాటు ప్రపంచ మానవాళికి ఇది మరో పరీక్షే” అని అన్నారు. ఎంపాక్స్ వేళ మన దేశ ఆరోగ్య శాఖ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని నౌకాశ్రయాల దగ్గర నిఘా పెంచాలని, వ్యాధి లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వెంటనే తెలపాలని పౌరులను కోరింది.
ఈ వ్యాధి సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు, వారికి చికిత్స అందించేందుకు వీలుగా ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహి యా, సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్ ఆసుపత్రులను ఆరోగ్యమంత్రిత్వ శాఖ గుర్తిం చింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇందుకోసం ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాయి. ఇక డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం.. 2022 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలలో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 15,600 కేసులు నమోదవగా.. 537 మంది ప్రాణాలు కోల్పోయారు.






