12 August, 2026 | 3:02 AM

కమీషన్ల పాలన సాగిస్తున్న రేవంత్

12-08-2026 01:40 AM

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి, కమీషన్ల పాలనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్నదని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

30..40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు తమ సొంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు కూడా పర్సంటేజీ ఇవ్వాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్యను కలిసిన ఒక రిటైర్డ్ ఉద్యోగికి 10 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లు క్లియర్ అవుతుందని చెప్పినట్లు వార్తలు రావడం శోచనీయమన్నారు.

అలాగే బిల్లులు క్లియర్ కావాలంటే 30 శాతం కమీషన్ ఇవ్వాలని అడుగుతున్నారని, సెక్రటేరియేట్‌లోనే డిప్యూటీ సీఎం చాంబర్ ముందు చిన్న కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగులు, పెన్షనర్లు, సర్పంచ్‌లు, సింగరేణి సంస్థ, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.