ఏఐబీఎఫ్ పేరుతో మోసాలు!
బ్రాహ్మణ సమాజం అప్రమత్తంగా ఉండాలి
ఖైరతాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య (ఏఐబీఎఫ్) పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో బ్రాహ్మణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సమాఖ్య నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ జ్యోతి, మహిళా అధ్యక్షురాలు మాలిని, వెన్నపల్లి జగన్మోహన్ శర్మ మాట్లాడారు.
బ్రాహ్మణ సమాజ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమాఖ్య పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు పదవులు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ద్రోణంరాజు రవికుమార్ అనే వ్యక్తి సమాఖ్య పేరుతో మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు.
అలాంటి వ్యక్తుల మాటలను నమ్మి ఎవరూ మోసపోవద్దని బ్రాహ్మణ సమాజానికి పిలుపునిచ్చారు. ఆయన చర్యలకు సమాఖ్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని, సమాఖ్య కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృతం చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు.






