11 May, 2026 | 8:52 AM

కొత్త రుణాలు లేవు.. పాత సబ్సిడీ రాదు..

22-06-2024 01:21 AM

నిర్వీర్యం దిశగా ఎస్సీ కార్పొరేషన్

  1. 2021 నుంచి జాడలేని కొత్త రుణాలు
  2. దళితబంధు రాకతో దళితుల ఆశలు ఛిద్రం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి) : దళితుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలసిన ఎస్‌సీ కార్పొరేషన్ రుణాలు నాలుగేళ్లుగా జాడలేవు. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఎస్‌సీ కార్పొరేషన్ రుణాల ద్వారా వందల సంఖ్యలో దళితులు లబ్ధి పొందేవారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీ రుణాలతో పలువురు వివిధ రకాల సూక్ష్మ, మధ్యరకమైన పరిశ్రమలను, షాపులను ఏర్పాటు చేసుకొని, వాహనాలను నడుపుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందేవారు. కానీ 2021లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసి దళితబంధును ప్రవేశపెట్టడంతో ఎస్‌సీ కార్పొరేషన్ రుణాలు పథకం దారి తప్పింది.

అర్హులైన వారికి ఆశించిన మేరకు దళితబంధు రాలేదు. ఇక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా అనేది దళితుల్లో అనుమానం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా నాలుగేళ్లుగా హైదరాబాద్ జిల్లాలోని పలువురు లబ్ధిదారులకు పాత రుణాల సబ్సీడీ రాకపోవడం, ఆశావహులకు కొత్త రుణాలు జాడ లేకపోవడం, దళితబంధుపై స్పష్టత లేకపోవడంతో దళితులు అయోమయం చెందుతున్నారు. 

విడుదల కాని పాత రుణాల సబ్సీడీ 

ప్రతీ సంవత్సరం ఎస్‌సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గతంలో అక్టోబర్, నవంబర్‌లో సబ్సీడీ రుణాల కోసం నోటిఫికేషన్ ఇచ్చేవారు. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఇంటర్యూలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ఎంపికైన లబ్ధిదారులకు రూ.1లక్ష నుంచి పది లక్షల వరకు వారు ఎంపిక చేసుకున్న యూనిట్‌ను బట్టి రుణం మంజూరయ్యేది. వారు పొందిన రుణాలపై రూ.1లక్షకు 80శాతం, రూ.2లక్షలకు 70శాతం,  రూ.2లక్షల పైన 60శాతం సబ్సీడీ లబించేది. బ్యాంకుల నుంచి ఆమోదం రావడంతో ఏప్రిల్ నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నుంచి సబ్సీడీ, బ్యాంకుల నుంచి రుణాలు వచ్చేవి.

కానీ ప్రతీ ఏటా ఇచ్చే ఈ సబ్సీడీ రుణాలను 2020 చివరిసారిగా ఇచ్చారు. ఆ సంవత్సరం దళితబంధును ప్రవేశపెట్టారు. దీంతో సబ్సీడీ రుణాల పథకం పక్కకు పోయింది. సబ్సీడీ రుణాల కోసం దళితులు ఎదురు చూస్తు న్నారు. హైదరాబాద్ జిల్లాలో 2021లో 426 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా.. వారి లో 120మందికే సబ్సీడీ సాంక్షన్ అయింది. మిగతా లబ్ధిదారుల సబ్సీడీ జాడలేదు. జిల్లా అధికారులు సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపినప్పటికీ గత ప్రభుత్వం స్పందించలేదు. ప్రస్తుత ప్రభు త్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో సబ్సీడీ ఎప్పుడు వస్తుందోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. దానికి తోడు గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా బ్యాంకుల నుంచి కాన్సెంట్ రాకపోవడం వల్ల పలువురు లబ్ధిదారులుగా ఎంపికైనప్పటికీ సబ్సీడీ, రుణాలు మంజూరు కాక పోవడం గమనార్హం.

కాంగ్రెస్ ప్రభుత్వంపై గంపెడాశలు

గత ప్రభుత్వం ఎస్‌సీ కార్పొరేషన్ రుణాల స్థానంలో దళితబంధును ప్రవేశపెట్టింది. 2022లో ప్రతీ నియోజకవర్గంలో 100మంది లబ్ధిదారులకు రూ.10లక్షల చొప్పున 100శాతం సబ్సీడీతో రుణాలను ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రతీ నియోజకవర్గంలోని 1100మందికి ఇస్తామని హామీ ఇచ్చింది. అదే సందర్భంలో దళితులకు రూ.12లక్షలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో దళితబంధు కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటు సబ్సీడీ రుణాలు, దళితబంధు పథకం అమలుకు నోచుకోక, ఇటు కాంగ్రెస్ ఇస్తామన్న రూ.12లక్షల రుణాలు ఎప్పుడు వస్తాయో తెలియక దళితులు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు.

గతంలో సబ్సీడీ రుణాలు పొందిన లబ్ధిదారుల వివరాలు

సంవత్సరం మంజూరైన గ్రౌండింగ్ గ్రౌండింగ్ 

యూనిట్లు యూనిట్లు కానివి

2020-21 426 120 306 

2019-20 నిల్ నిల్ నిల్

2018-19 290 248 42 

2017-18 1092 1014 78 

2016-17 362 345 17