ముగిసిన ఎమ్మెల్యే సత్యం సతీమణి అంత్యక్రియలు
కడుపునొప్పికి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన కుటుంబసభ్యులు
మేడ్చల్, జూన్ 21 (విజయక్రాంతి): ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి(34) అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ బోయినపల్లి రోడ్డులోని డెయిరీ ఫాం శ్మశానవాటికలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ కాలనీకి చెందిన రూపాదేవిని 2012లో కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి యోజిత్ (11), రిషికశ్రీ(10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతకుముందు వీరు పేట్ బషీరాబాద్‌లోని దవేరియా విల్లాస్‌లో నివాసం ఉండేవారు.
నెల రోజుల నుంచి అల్వాల్ పీఎస్ పరిధి పంచశీల కాలనీలోని శ్రీచక్ర నిలయంలో నివాసం ఉంటున్నారు. సత్యం 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్ప దండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రూపాదేవి మేడ్చల్ జిల్లా రావల్‌కోల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం ఎమ్మెల్యే సత్యం చొప్పదండి పర్యటనకు వెళ్లారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రూపాదేవి భర్తకు వీడియో కాల్ చేసి మాట్లా డింది. అనంతరం బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకీ తలుపులు తీయకపోవ డంతో అక్కడే ఉన్న రూపాదేవి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు తలుపులను ధ్వంసం చేసి లోపలికి వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించింది.
కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక రెనోవా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలియడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే సత్యం.. భార్య మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమ య్యారు. భార్య మృతికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు. వైద్యులు పరీక్షించి రక్తపోటు కారణంగా స్పృహ తప్పినట్టు గుర్తించి చికిత్స అందించారు. అయితే, రూపాదేవి గత రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుందని, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కడుపునొప్పిని తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఎమ్మెల్యేకు పలువురి పరామర్శ..
రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విష యం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం అర్ధరాత్రే రెనోవా వైద్యశా లకు వెళ్లి ఎమ్మెల్యే సత్యంను ఓదార్చారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను పరామర్శించారు.






