2 July, 2026 | 12:19 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

సేవకు నో రిటైర్మెంట్

16-02-2025 12:00 AM

చాలామంది రిటైర్ కాగానే ఇంటికే పరిమితమవుతారు. కానీ కొందరు మాత్రం సమాజ సేవలో సంతృప్తి పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. పదవీ విరమణ సమయంలో వచ్చే డబ్బు, పీఎఫ్ సొమ్ము, పింఛన్ డబ్బు స్వప్రయోజనాల కోసం కాకుండా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. రిటైర్మెంట్ అనేది వయసుకే కాని, సేవకు కాదు అని నిరూపిస్తున్నారు.  

ఆడపిల్లల కోసం బస్సులు

రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ ఓ చిన్నపట్టణం. అక్కడున్న స్కూళ్లు, కాలేజీలకీ ఆ చుట్టుపక్కల పదిగ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. కానీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద పిల్లలు చదువుకోవడానికి కనీసం 10 కిలోమీటర్లు నడిచే వెళ్లాల్సి ఉంటుంది.

అయితే ప్రభుత్వాసుపత్రిలో పిల్లల వైద్యుడైన ఆర్పీ యాదవ్ ఒకసారి కారులో వెళుతూ బరువైన బ్యాగుల్ని మోసుకుంటూ, ఆకతాయిల వేధింపులను ఎదుర్కొంటూ ఇంటికెళ్లే విద్యార్థినుల్ని చూశారు. ఆ సమయంలో కొందరికి లిఫ్టు ఇచ్చి వారి సమస్యల్ని తెలుసుకున్నారు.

గ్రామాల నుంచి బస్సుల్లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకున్న ఆయన వాళ్లకు ఎలాగైనా సాయపడాలనుకున్నారు. తన దగ్గర ఉన్న పీఎఫ్ సొమ్ము రూ.19 లక్షలు వెచ్చించి ఓ బస్సును కొనుగోలు చేసి డ్రైవర్‌ను నియమించాడు.

దాంతో అమ్మాయిలు సౌకర్యంగా స్కూళ్లకీ కాలేజీలకీ వెళుతున్నారు. అలానే, చదువు మానేసిన ఆడపిల్లలు మళ్లీ కాలేజీకి వెళ్లడానికి ముందుకొచ్చారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో మరో మూడు బస్సులను కొనుగోలు చేసి తన పింఛను సొమ్ముతో వాటిని నడిపిస్తున్నారు యాదవ్. 

వీధులను ఊడ్చుతూ..

 బెంగళూరుకు చెందిన సూర్య నారాయణ్ అనే రిటైర్డ్ ఉద్యోగి 24 ఏళ్లుగా విధులను ఊడ్చటం, మురుగు కాల్వలను శుభ్రం లాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. రైతు కుటుంబంలో పెరిగిన ఆయన చెట్లను నాటడం, పర్యావరణాన్ని సంరక్షించడం ఎంతో ఇష్టం. తనలాంటివాళ్లు ప్రశాంతమైన జీవితం గడుపుతుంటే, అందుకు భిన్నంగా చీపురు పట్టుకుని ప్రతిరోజూ విధులను శుభ్రం చేస్తున్నాడు.

అయితే 2001లో వర్షాకాలంలో వచ్చిన వరదల కారణంగా వీధులు, మురుగు కాల్వలు చెత్తాచెదారంతో నిండిపోవడం చూసి స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాడు. తన భార్య సాయంతో అవిశ్రాంతంగా పనిచేస్తూ బెంగళూరులోని ఎన్నో విధులను అందంగా మార్చుతున్నాడు. మొక్కలనూ నాటుతున్నాడు. 83 ఏళ్ల వయస్సులోనూ వీధులను ఊడ్చుతూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడీయన. 

అభాగ్యులకు అండగా.. 

కేరళకు చెందిన సురేంద్రన్ సీబీఐ అధికారిగానూ, అతని భార్య సతియమ్మ టీచర్‌గానూ పని చేశారు. వాళ్ల ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రిటైర్ అయిన సురేంద్రన్ దంపతుల దగ్గర కావాల్సినంత డబ్బుంది. ఆ డబ్బును నలుగురికీ ఉపయోగపడేలా ఖర్చు పెట్టాలనుకున్నారు.

కొల్లాం జిల్లాలో అనాథల్నీ, అభాగ్యుల్నీ చేరదీస్తున్న గాంధీభవన్ స్వచ్ఛంద సంస్థకు మంచి పేరుంది. సొంత భవనం లేక ఆ సంస్థ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది సురేంద్రన్ దంపతులకి. దాంతో ఓ ప్రధాన రహదారి పక్కన కొన్నాళ్ల క్రితం కొనుక్కున్న స్థలం నిరుపయోగంగా ఉండటం గుర్తొచ్చింది.

దాదాపు కోటిరూపాయల విలువ చేసే ఆ స్థలాన్ని గాంధీ భవన్‌కు ఇచ్చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. దాని నిర్వహణ కోసం తమ పింఛను డబ్బును అందించడానికి కూడా ముందుకొచ్చి ఎంతోమందికి అండగా నిలిచారు.