calender_icon.png 2 February, 2026 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నింటా జయమే

16-02-2025 12:00:00 AM

జయా బాదురి.. భారతీయ సినీ చరిత్రలో గొప్ప నటీమణుల్లో ఒకరు. పొడవాటి జుట్టు, అందమైన చిరునవ్వుతో 1970లో ఇండస్ట్రీ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకున్న నటి. అర్థవంతమైన పాత్రలతో వెండితెరను మహారాణిలా పాలించారు. అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ సహజ సిద్ధమైన నటనతో రాణించారు. 1970లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి కూడా జయా బాదురియే కావడం విశేషం. ఒకానొక సమయంలో తన భర్త బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కంటే కూడా పెద్ద స్టార్  కావడం గమనార్హం. 

జయా బాదురి 9 ఏప్రిల్ 1948లో కలకత్తా ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇందిరా బాదురీ, తరున్ కుమార్ బాదురీ. ఈమె తండ్రి ఒక రచయిత, పత్రికా సంపాదకుడు, రంగస్థల నటుడూ కావడంతో చిన్ననాటి నుంచే ఆమెకు నటనపై ఆసక్తి కలిగింది. జయా బాదురి 1973లో సహ నటుడు అమితాబ్ బచ్చచ్‌ను వివాహం చేసుకుని జయ బాదురి కాస్తా.. జయా బచ్చచ్‌గా మారారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్. 

రీల్ లైఫ్..

సత్యజిత్ రే దర్శకత్వంలో రూపొందిన మహానగర్ (1963) సినిమాతో చిన్న వయసులోనే జయా బచ్చన్ సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత రుషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన గుడ్డి (1971) అనే సినిమాతో ఆమె తొలిసారిగా పెద్ద పాత్ర పోషించారు. ఉపహార్ (1971), కోషిష్ (1972), కోరా కాగజ్ (1974) వంటి చిత్రాలు ఆమె సినీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి.

ఆమె అమితాబ్‌తో కలిసి జంజీర్ (1973), అభిమాన్ (1973), చుప్కే చుప్కే (1975), మిలి (1975), షోలే (1975) వంటి అనేక చిత్రాలలో నటించారు. వివాహానంతరం జయా బచ్చన్ చాలా కాలం పాటు సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.

17 సంవత్సరాల విశ్రాంతి తర్వాత, ఆమె చౌరాసి కి మా (1998)తో తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. కభీ ఖుషీ కభీ ఘమ్.. (2001), కల్ హో నా హో (2003) వంటి చిత్రాల్లో తల్లి పాత్రలో నటించి అవార్డులు సైతం అందుకున్నారు. 2023లో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (2023) చిత్రంలోనూ నటించారు. 

పెళ్లికి ముందే కండీషన్?

నటుడు అమితాబ్ బచ్చన్.. తన సతీమణి జయా బచ్చన్‌కు పెళ్లికి ముందే కొన్ని కండీషన్స్ పెట్టారట. “పెళ్లి నాటికి నేను నటిగా రాణిస్తూ.. వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నా. అప్పటికి నాకున్న వృత్తిపరమైన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకొని పెళ్లి చేసుకోవాలని మేమిద్దరం తొలుత నిర్ణయించుకున్నాం.

అదే సమయంలో ఆయన నాకొక కండిషన్ పెట్టారు. షిఫ్టుల్లో వర్క్ చేసే సతీమణి తనకు వద్దని.. మంచి ప్రాజెక్ట్లు ఎంచుకొని, సరైన వ్యక్తులతో వర్క్ చేయాలని తెలిపారు. అయితే మా ఇంట్లో వాళ్లతో పెళ్లి గురించి అమితాబ్ మాట్లాడారు.

కానీ అప్పుడే పెళ్లి చేయడం మా నాన్నకు ఇష్టం లేదు. కానీ మా ఇష్టాన్ని గౌరవించి వివాహం జరిపించారు” అని జయా బచ్చన్ తెలిపారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్న  జయా బచ్చన్  ప్రస్తుతం తన కుటుంబంతో ముంబైలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.