02-12-2025 02:07:42 AM
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు విలేకరులతో పంచుకున్నారు.
2014లో మేమే చేసిన ‘-లెజెండ్’ ఎన్నికల ముందు విడుదలై, పెద్ద విజయాన్ని సాధించింది. అదే కాంబోలో మళ్లీ ఈ ఎన్నికల ముందు ఓ సినిమా చేయాలనుకున్నాం. మేం అనుకున్న కథ సరిగ్గా ఎలక్షన్స్ ముందే రావాలి.. ఎలక్షన్ డేట్ క్లారిటీ లేకపోవడంతో ఆ కథను పక్కనపెట్టి ‘అఖండ2’ను ముందుకు తీసుకెళ్లాం.
కథ వినగానే త్రీడీలో బాగుంటుందనుకున్నాం. 2డీ, 3డీ రెండూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం. అయితే పాన్ ఇండియా కోసం ప్రత్యేకంగా కథలో చేసిన మార్పులేవీ చేయలేదు. ఇది పాన్ ఇండియా కంటెంట్. కథ గ్లోబల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సినిమాలో చాలా గూజ్‌బంప్స్ మూమెంట్స్ ఉంటాయి.
ఈ సినిమాను కుంభమేళాలో షూట్ చేశాం. అక్కడ షూట్ అంటే చాలా పర్మిషన్స్ కావాలి. డ్రోన్స్ సహా మాకు అన్ని అనుమతులూ దొరికాయి. సినిమాలో చూపించే ప్రతి సీన్ దీనికోసం తీసిందే. స్టాక్ షాట్స్‌ను ఉపయోగించలేదు.
నిజానికి క్లుమైక్స్‌ను కశ్మీర్‌లో షూట్ చేయాలి. కానీ అప్పుడే పెహెల్గాం దాడి జరగడంతో అనుమతి దొరకలేదు. జార్జియాలో మైనస్ డిగ్రీ చలిలో షూట్ చేశాం. అందరం స్వెటర్లు వేసుకున్నాం. కానీ బాలయ్య అఘోర గెటప్‌లో స్లీవ్ లెస్‌లో అలా చలిలోనే అద్భుతంగా నటించారు. మరొకరైతే అంత చలిలో అలాంటి యాక్షన్ చేయడం అసాధ్యం.
బోయపాటిలో ఒక గొప్ప లక్షణం ఉంది.. ఏది చెప్పినా వింటారు. ఆ ప్రాజెక్టుకు అవసరమయ్యే సూచనలైతే వెంటనే ఆచరణలో పెడతారు.
ఇందులో సనాతన ధర్మం గురించి ఉంటుంది. అదే మా సినిమా యూఎస్పీ అనుకుంటున్నాం. చిన్నపిల్లలు, దేవాలయాల జోలికి వస్తే ఆ పరమశివుడే వస్తాడని ‘అఖండ’లోనే రిజిస్టర్ చేశాం. దానికి కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన కంటెంట్ అని అభినందించారు.
ఈ చిత్రాన్ని -అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ విడుదల చేస్తున్నాం. బీహార్‌లో అవధి అనే ఒక భాష ఉంది. ఆ లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేస్తున్నాం.
ఈ యూనివర్స్‌లో మరో సినిమా చేసే స్కోప్ ఉంది. బాలయ్య, బోయపాటి అనుకుంటే ఏదైనా అవ్వచ్చు.. అఖండ3 ఉండొచ్చు. ఇందులో మేము మొదలుపెట్టిన కథ అయితే సంపూర్ణంగా పూర్తవుతుంది. -కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాం. ఒక పెద్ద సినిమా ప్రాసెస్‌లో ఉంది. త్వరలోనే దాని గురించి చెప్తాం.