ఇక్కడ ఎక్స్‌ప్రెస్ ఆగదు?
రిజర్వేషన్ కౌంటర్ ఉన్నా ఇటిక్యాలలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నో స్టాప్
4 మండలాల ప్రజలకుఇబ్బంది
పట్టించుకోని దక్షిణ మధ్య రైల్వే అధికారులు
ఇటిక్యాల, జూలై 6: జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఇటిక్యాల రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ స్టేషన్.. ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోలి, ఐజ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వ్యాపారస్థులకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది.
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండేళ్ల క్రితమే ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా ప్రతి నెలా సీజన్ పాస్లు, ఏసీ, స్లీపర్ క్లాస్ టికెట్ల రూపంలో రైల్వే శాఖకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. అయితే, ఇక్కడ టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు.. ఎక్స్ప్రెస్ రైళ్లకు ఇటిక్యాలలో స్టాపింగ్ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
30 నుండి 50 కిలోమీటర్ల ప్రయాణం: ఇటిక్యాలలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడం వల్ల, ఇక్కడ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు రైలు ఎక్కడానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల్ స్టేషన్కు లేదా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూల్ సిటీ స్టేషన్కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో కేవలం ప్యాసింజర్ రైళ్లతో పాటు హైదరాబాద్-కర్నూల్ సిటీ హంద్రీ ఎక్స్ప్రెస్ మాత్రమే ఆగుతోంది.
సికింద్రాబాద్ - కర్నూల్ మధ్య నడిచే తుంగభద్ర ఎక్స్ప్రెస్, అలాగే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (7 హిల్స్) వంటి కీలక రైళ్లను ఇటిక్యాల స్టేషన్లో ఆపాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ , ఉన్నతాధికారులకు పలుమార్లు వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇటిక్యాల స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని 4 మండలాల ప్రజలు కోరుతున్నారు.
ఎక్స్‌ప్రెస్ ఆపేలా చర్యలు తీసుకోవాలి..
ప్రయాణికుల ఇబ్బందులను, అలాగే రైల్వే శాఖకు వచ్చే ఆదాయాన్ని గమనంలో ఉంచుకుని, మానవీయ కోణంలో ఆలోచించి ఎక్స్ప్రెస్ రైలు ఆపేలా చర్యలు తీసుకోవాలి
బాబు, ఇటిక్యాల






