7 July, 2026 | 1:05 AM

గర్భవతుల పేర్లను వంద శాతం నమోదు చేయాలి

07-07-2026 12:11 AM

డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

మంచిర్యాల టౌన్, జూలై 6 : జిల్లాలో వంద శాతం గర్భవతుల నమోదు, అదే స్థాయిలో టీకాలు ఇప్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. సోమ వారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రం వైద్య సిబ్బందికి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎం ఎల్ హెచ్ పీ)లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉప కేంద్రాలలో సమయపాలన పాటిస్తూ రోగులకు చికిత్స అందించడం, చిన్న వ్యాధులను గుర్తించడం, కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, ఆర్ డి గెట్టిల ద్వారా పరీక్షలు చేయడం, గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో దోమలు లేకుండా చేయడం, పరిసరాల పరిశుభ్రత అదేవిధంగా దోమలు లార్వాలు పెరగకుండా చర్యలు చేపట్టడం, ఉప కేంద్రం పరిధిలో మంగళ వారము, శుక్ర వారము డ్రైడే చేపట్టడం, ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అదే విధంగా అన్ని రకాల మందులను ఉపకేంద్రములో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అసంక్రమణ వ్యాధులు, 30 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేయడం, వ్యాధిగ్రస్తులను గుర్తించడం, బీపీ, షుగర్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి సరైన సమయంలో మందులు అందజేయాలన్నారు. తమ పరిధిలోని గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో పని చేస్తూ అన్ని వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ అనిల్, డెమో బుక్క వెంకటేశ్వర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ రషీద్, డిపిఓ ప్రశాంతి, డి పి హెచ్ ఎన్ ఆర్ ఎస్ పద్మ, డిడిఎం ప్రవళిక, క్షయ వ్యాధి నియంత్రణ కోఆర్డినేటర్ సురేందర్, డిడిఎం భాగ్య, ఎన్ సి డి కోఆర్డినేటర్ లక్ష్మణ స్వామి, జిల్లాలోని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పాల్గొన్నారు.