7 July, 2026 | 1:11 AM

ప్రజావాణికి 79 దరఖాస్తులు

07-07-2026 12:13 AM

నస్పూర్, జూలై 6 : కలెక్టరేట్ లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో 79 మంది బాధితులు దరఖాస్తు చేసుకోగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమ వారం జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వీ రాములులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.

హాజీపూర్ మండలం నమ్నూర్ జీపీ చందనాపూర్ వాసులు ఆర్ అండ్ ఆర్ కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని, జైపూర్ మండలం రామారావుపేటకి చెందిన కడియాల పద్మ తనకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొనుటలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆలస్యం జరిగిందని, ఇప్పుడు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి అందించాలని, నెన్నెల మండలం గంగారానికి చెందిన పాగిడి శోభ తాను ఏ ఎన్ ఎం, ఇంటర్, ఎం పి హెచ్ డబ్ల్యు అర్హత కలిగి ఉన్నానని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాధి కల్పించి ఆదుకోవాలని, బెల్లంపల్లి పట్టణం కాంట్రాక్టర్ బస్తీకి చెందిన కొలిపాక శ్రీనివాస్ నివాస ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,

ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ ప్రాంతానికి చెందిన బాసపోయిన రవీంద్ర కుమార్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ళలో కొనుగోలు చేసిన భూమికి ముటేషన్ ద్వారా పట్టా జారీ చేయాలని, లక్షెట్టిపేట మండలం చందారానికి చెందిన రాచర్ల సంతోష్ తన తండ్రి పేరిట గ్రామ శివారులో భూమి ఉందని, దానిని కొందరు అక్రమంగా ఆక్రమించి పట్టా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలా పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణికి ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.