17 July, 2026 | 1:18 AM

9వ తరగతిలో త్రిభాష వద్దు

17-07-2026 01:18 AM
  1. చేర్చాల్సిన అవసరం ఏముంది.. సీబీఎస్‌కి సుప్రీం ప్రశ్న
  2. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం ఊరట

భువనేశ్వర్, జూలై 16: తొమ్మిదో తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని అమలు చేయవద్దని సుప్రీంకోర్టు గురువారం సీబీఎస్‌ఈకి స్పష్టం చేసింది. 9వ తరగతి చదవడం విద్యార్థులకు ఇప్పటికే కష్టంగా ఉందని, అలాంటిది మూడో భాషను చేర్చాల్సిన అవసరం ఏమిటని? సీబీఎస్ బోర్డును కోర్టు ప్రశ్నించింది. ఇది విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతుందని పేర్కొంది. ఇలా చేయవద్దని భారత ప్రభుత్వాన్ని కోరాలని తెలిపింది.

దీంతో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట లభించింది. విద్యార్థులు మరింత సమర్థవంతంగా అలవాటు పడటానికి వీలుగా, 5వ లేదా 6వ తరగతి నుంచే త్రిభాషను ప్రవేశపెట్టాలని జస్టిస్లు బీవీ నాగరత్న, ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలను (జేఎన్వీలను) ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరుపుతోంది.

జేఎన్వీలలో అమలు చేసిన త్రిభాషా విధానానికి తమిళనాడు ప్రభుత్వం సుముఖంగా లేదు. అదే సమయంలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూమిని మాత్రమే సమకూర్చాలని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు.

వ్యతిరేక వైఖరిని అవలంబించొద్దన్నారు. తదుపరి విచారణను ఆగస్ట్ 11కు వాయిదా వేశారు. దేశవ్యాప్త నవోదయ విద్యాలయాల్లో త్రిభాషా విధానంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ప్రత్యేకంగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.