19 March, 2026 | 8:25 AM

వరదల నివారణకు ‘నోడల్ ఏజెన్సీ’

19-03-2026 02:05 AM
  1. కాలువల ఆక్రమణలతో వరదల ప్రవాహం
  2. మూసీ పునరుద్ధరణ చారిత్రాత్మక ఘట్టం
  3. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ 

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): వర్షాకాలంలో సంభవించే వరదల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వరదల నివారణకు ప్రభుత్వం ప్రత్యేకించి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

బుధవారం ఎంసీఆ ర్‌హెచ్‌ఆర్డీలో కేంద్ర జలవనరుల సంఘం, కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్‌ల ఆధ్వర్యంలో జరిగిన వరద మైదానాల జోనింగ్‌పై జరిగిన ప్రాంతీయ స్థాయి శిక్షణా శిబిరంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ తప్పిదాలతోటే తరచుగా వరద విపత్తులు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 సెప్టెంబర్‌లో సంభవించిన వరదల ఉదృతికి రాష్ట్రంలో భారీ ఎత్తున నష్టం సంభవించిందని పేర్కొన్నారు.

మున్నేరు నది ఉప్పొంగి 36 అడుగుల ఎత్తుకు నీరు చేరడంటి ఖమ్మం పట్టణం అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇండ్లు పైకప్పుల వరకు మునిగిపోయిన విషయాన్ని చెప్పారు. 29 మంది మృత్యువాత పడ్డారని, రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లడంతో పాటు 20 లక్షల ఎకరాల్లో పంట నీటిమట్టం పాలు అయిందని వివరించారు. భద్రాచలం సమీపంలోని గోదావరి నది ప్రమాదస్థాయిని మించి వరద ఉధృతి రావడంతో భద్రాచలం రహదారి తెగిపోయింద న్నారు.

ఆ వరదల ప్రభావం 29 జిల్లాలపై పడిందని, చెరువులు, కుంటలు పొంగి పొర్లడంతో పాటు కట్టలు తెగి పడడంతో పంటలతో పాటు వేలాది కిలోమీటర్లు దూరం రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయన్నారు. సహజసిద్ధంగా ప్రవహించే కాలువల ప్రవాహాన్ని ఆక్రమణల ద్వారా అడ్డుకోవడంతోటే తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అటువంటి వరదల సమయంలో విపత్తులు పునరావృతం కాకుండా విపత్తుల నివారణకు శాస్త్రవేత్తలు ఏఐ, జీఐఎస్‌ల వంటి ఆధునిక పరిజ్ఞానంతో సురక్షిత మార్గాలు అన్వేషించాలని ఆయన కోరారు.

మూసీ నది భాగ్యనగరానికి జీవనాడి అని, అటువంటి మూసినదిని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించడం అభినందనీయమని కొనియాడారు. సీడబ్ల్యూసీ మూడు జోన్లను సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించిన విధంగా ప్రొటెక్టెడ్ జోన్, రెగ్యులేటరీ జోన్, వార్నింగ్ జోన్‌గా అమలు చేస్తామని తెలిపారు.

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ మూసీ రివర్ రీజువెనేషన్ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద పట్టణ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్లలో ఒకటిగా మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేసి, మూసీ నది పరిధిలో ప్రొటెక్టెడ్, రెగ్యులేటరీ జోన్లను గుర్తిస్తున్నామని చెప్పారు.