7 April, 2026 | 4:19 AM

వివక్ష లేని వైద్యం

02-12-2024 12:17 AM
  1. ‘మైత్రి ట్రాన్స్’తో ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య రక్షణ
  2. 33 జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక క్లినిక్‌ల ఏర్పాటు
  3. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క
  4.  3 వేలకు పైగా ట్రాన్స్‌జెండర్లకు లబ్ధి  
  5. ట్రాఫిక్ వలంటీర్లుగా పైలట్ ప్రాజెక్టు

హైదరాబాద్, డిసెంబర్ 01 (విజయ క్రాంతి): సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల  సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సమాజంలో వారికి కూడా గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటున్నది.

వివక్ష కారణంగా ట్రాన్స్‌జెండర్లు ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్సను పొందలేకపోతునున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక వైద్య సేవలందించేందుకు ‘మైత్రి ట్రాన్స్ క్లినిక్’ల పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నది 

జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ట్రాన్స్ క్లినిక్‌లు..

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా వైద్యం అందించేందుకు ప్రత్యేకమైన సేవలు లేవు. దీంతో వైద్యం చేయించుకోవడానికి ట్రాన్స్‌జెండర్లు, వైద్యం చేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇకపై ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని భావించిన రాష్ట్రప్రభుత్వం వారి కోసం ‘మైత్రి క్లినిక్’ పేరుతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకమైన వైద్య విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నది.

మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో మైత్రి ట్రాన్స్ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లినిక్‌ల్లో వారంలో 2 రోజులు ఓపీ సేవలు అందించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందిస్తారు. ఈ క్రమంలో క్లినిక్‌కు వచ్చే పేషంట్ల సంఖ్య పెరిగితే అవసరాన్ని బట్టి ఓపీ సేవలు అందించే రోజుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

ప్రత్యేక వైద్య బృందం..

మైత్రి ట్రాన్స్ క్లినిక్‌లో వైద్య సేవలందించేందుకు ప్రత్యేకంగా వైద్యులను నియమిస్తున్నారు. ఒక్కో క్లినిక్‌కు మొత్తం ఐదుగురు డాక్టర్లను నియమించడమే కాకుండా వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇందులో గైనకాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, మానసిక వైద్యుడు, జనరల్ ఫిజిషియన్‌తోపాటు ఓ నర్సు కూడా ఉంటారు.

ఈ క్లినిక్‌లో ఏర్పాటు చేసిన వార్డులోనే ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. వైద్యులు రాసిచ్చే మందులను తీసుకునేందుకు కూడా ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 3 వేలకు పైగా ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వారిలో వెయ్యికి పైగా హైదరాబాద్‌లోనే ఉన్నారు.

అయితే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్న వైద్య సేవలతో రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లందరికీ ఎంతో లబ్ధి చేకూరనున్నది. క్లినిక్‌లను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు..

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొందరు చెడు దారిలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం నుంచి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా వారిని ట్రాఫిక్ విభాగంలో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి గల వారిని గుర్తించి నియమించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల మాదిరిగానే ట్రాన్స్‌జెండర్లును వలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులను ఎంపిక చేసి ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతినెలా స్టుఫైండ్ కూడా ఇవ్వనున్నారు. 

నేడు వర్చువల్‌గా మైత్రి ట్రాన్స్ క్లినిక్‌ల ప్రారంభం

ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో మైత్రి ట్రాన్స్ క్లినిక్‌లను ప్రారంభిస్తుంది. వీటిని సీఎం రేవంత్‌రెడ్డి, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మహిళా సంక్షేమ, వైద్య శాఖల ఆధ్వర్యంలో ఈ క్లినిక్‌లను నిర్వహిస్తారు.

డిసెంబర్ 2వ తేదీన నిర్వహించే వేడుకల్లో 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కళాశాలలు, 213 కొత్త అంబులెన్సులను ప్రభుత్వం ప్రారంభించనున్నది. వీటితోపాటు ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారిని ట్రాఫిక్ వలంటీర్లుగా నియామకంపై పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభించనున్నది.