13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్ కాదు.. మరింత కఠిన చర్యలు

24-03-2026 12:00 AM

అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టీకరణ 

నిజామాబాద్, మార్చి 23(విజయ క్రాంతి) : విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్‌తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఇటీవల పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ, పైవిధంగా హెచ్చరికలు చేశారు. ఎంతో బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యానికి తావిచ్చే వారిపై తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయని కరాఖండీగా తేల్చి చెప్పారు.

పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎం.పీ.ఓలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.