23 May, 2026 | 3:40 PM

మార్గదర్శి బాధితుల కోసం నోటీసులు

21-08-2024 06:42 AM
  1. మూడు భాషా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి 
  2. రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మార్గదర్శి ఫైనాన్సియర్స్ చందాదారులకు నగదు తిరిగి ఇచ్చిందో? లేదో? ఎవరైనా బాధితులు ఉన్నారో? తెలుసుకునేందుకు మూడు వేర్వేరు భాషలకు చెందిన పత్రికల ద్వారా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో బాగా ప్రచారం జరిగేలా నోటీసులు ఇవ్వాలని సూచించింది.

అలాగే చందాదారుల వివరాలు మార్గదర్శి సంస్థ ద్వారా పెన్ డ్రైవ్‌లో ఇవ్వాలని కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ అయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు చెప్పింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. 

ఈ మేరకు జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. చట్టాలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు చెప్పింది.

దానిని సవాల్ చేస్తూ ఉండవల్లి,  గత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ రావు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది.  

మార్గదర్శి అక్రమాలపై ఆర్బీఐ కౌంటర్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ని ప్రతివాదుల జాబితాలో చేర్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కంపెనీ చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లను సేకరించిందని గత వారం ఆర్బీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ (హెచ్యూఎఫ్) పేర చిట్‌ఫండ్స్ పెట్టి చందాదారుల నుంచి ఎద్ద ఎత్తున చందాలు సేకరించడం చట్టవ్యతిరేకమని పేర్కొంది.

ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ (1), సెక్షన్ 45 ఎస్ (2) ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి డిపాజిట్ల సేకరణ చేయడం చెల్లదని వివరించింది. మంగళవారం జరిగిన విచారణలో మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూద్రా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యారు తెలంగాణ, ఏపీ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు పల్లె నాగేశ్వర్‌రావు, రఘురామ్, ఆర్బీఐ న్యాయవాది కే రతంగపాణిరెడ్డి హాజరయ్యారు.