12 April, 2026 | 8:44 PM

మోదీ షాలకు నోటీసులు ఇవ్వాలి

01-05-2024 12:47 AM

ఈసీకి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డికి నోటీసు ఇచ్చే బదులుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు ఈసీ నోటీసులు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినందుకు ఢిల్లీ, జార్ఖండ్ సీఎంలను జైల్లో పెట్టారని, కొత్తగా రేవంత్‌రెడ్డిని కటకటాల్లోకి పంపాలని ఏర్పాట్లు చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో మగ్దూమ్ భవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని పరిశీలించేందుకు అమిత్ షా పరిధిలో ఉండే ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక బాధ్యతను అప్పగించారని ఆయన ఆరోపించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళుతున్న రేవంత్ సంగతి ఏంటో తేల్చాలని అమిత్ షా అధికారులకు చెప్పినట్లు నారాయణ వివరించారు.

సోషల్ మీడియాను నియంత్రించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముస్లింలకు సం బంధించిన రిజర్వేషన్లను తీసివేస్తామని మోడీ చెబుతున్నారన్నారు. ఇండియా కూటమి గెలిస్తే మంగళసూత్రాలు స్వాధీనం చేసుకుంటారన్న వ్యాఖ్యలతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. ఇండియా కూటమి గెలిస్తే దేశానికి ప్రమాదమని చెప్పడం పట్ల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేస్తే మోదీ పతనం మొదలవుతుందన్నారు. రాజకీయంగా వ్యతిరేకించిన కేజ్రీవాల్, రేవంత్‌రెడ్డి దేశ ద్రోహులా అని 

ప్రశ్నించారు.