జనరల్ దవాఖానలో ప్ర‘జల’ పాట్లు!

01-05-2024 12:46:44 AM

తాగు నీటి కోసం పేద ప్రజల ఆరాటం

వైద్యాధికారులకు ఉచితంగా పంపిణీ

సామాన్యుల వద్ద ముక్కుపిండి వసూళ్లు 

క్యాంటీన్ తీరుపై పట్టింపులేని ఉన్నతాధికారులు

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 30 (విజయక్రాం తి): నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ దవాఖానకు వచ్చే రోగులు తాగు నీటి కోసం తిప్ప లు పడుతున్నారు. ఒక్క రూపాయికే లీటరు నీటిని సేవా సంస్థ వారు ఇస్తున్నారు కదా అని చెప్తూ.. అధికారులు తమ బాధ్యతను ఇతరుల భూజాన వేస్తున్నారు. వారు మాత్రం పక్కనే ఉన్న క్యాంటీన్‌లో ఉచిత తాగునీటికి అలవాటు పడ్డారు. సేవాసంస్థ తరఫున దవాఖానలో ఏటీఎం (ఎనీ టైం వాటర్) యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, అందులో సక్రమంగా నీటిని నింపకపోవడంతో రోగులకు తరచూ తాగు నీటి కొరత ఏర్పడుతున్నది. ఇదేంటి సార్ అని అడిగే రూ.౫ పెట్టి కొనుక్కోలేరా? అని అధికారులు అంటున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

పక్కనే క్యాంటీన్‌లో ఉంటాయ్ పోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నార ని మండిపడుతున్నారు. అధికారుల మద్దతుతో క్యాంటీన్ యజమానులు కూడా తాగునీటిపై అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపి స్తున్నాయి. ప్రభుత్వ దవాఖాన అని వస్తే అడుగడుగునా దోపిడీ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత కారణం గా ఒక్కో మనిషి రోజుకు దాదాపు 6 నుండి 10 లీటర్ల నీటిని తాగుతున్న పరిస్థితి. కానీ, వేల సంఖ్యలో ఆసుపత్రికి వచ్చే రోగులకు గుక్కెడు నీటిని కూడా ఏర్పాటు చేయకపో డం పట్ల రోగులు, వారిబంధువులు ఆందోళన చెందుతున్నారు. దవాఖానకు వచ్చే నిధులు దేనికి ఖర్చు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.  

నిత్యం వేల సంఖ్యలో దవాఖానకు..

జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ తదితర గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ దవాఖానకు  వేల సంఖ్యలో రోగులు వచ్చి పోతుంటారు. ప్రసవం, ఆర్థోపెడిక్స్ రోగులతోపాటు సాధారణ, ఇతర జబ్బులతో బాధ పడుతూ చికిత్స పొందేవారు 500 మందికి పైగా ఇన్‌పెషంట్స్‌గా ఉంటారు. వారితోపాటు వచ్చే అటెండెంట్స్, ఆసుపత్రి సిబ్బం ది, కార్మికులు ఇలా రోజు ఐదు వేలకు పైగా నే ఆసుపత్రికి వస్తుంటారు. కానీ, హాస్పిటల్‌లో తాగునీటి వసతి కల్పించకపోవడంపై ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. సేవా కార్యక్రమాలు చేసే వారిపై ఆధారపడుతూ మిషన్ మొరాయించిన సమయంలో.. నీటి కోసం నిలదీసే రోగుల ను అధికారులు చీదరించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా చిన్న చిన్న కారణాలు పక్కనబెట్టి రోగులకు తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. 

ఇబ్బంది కొన్ని గంటలే..

రోగులకు ప్రస్తుతం నీటి సమస్యలేదు. సత్యసాయి సేవాట్రస్టు ద్వారా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటు అప్పుడప్పుడు మొరాయిస్తుంది. కొన్ని గంటలు ఇబ్బంది ఉంటది అంతే. పక్కన క్యాంటీన్ వారు కూడా ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టు మా దృష్టికి రాలేదు. ఆసుపత్రి నుంచి కూడా రోగులకు నీటి వసతి త్వరలో ఏర్పాటు చేస్తాం. 

 డాక్టర్  అబ్దుల్ అజీమ్, ఇన్‌చార్జి సూపరింటెండెంట్