calender_icon.png 17 February, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపసర్పంచులు వార్డు సభ్యులకు నోటీసులు

17-02-2026 12:00:00 AM

మునుగోడు, ఫిబ్రవరి 16 : మనుగోడు మండల పరిధిలోని గ్రామ పంచాయతీల ఉపసర్పంచులు మరియు వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమానికి హాజరుకాని ప్రజాప్రతినిధులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కమిషనర్ పంచాయతీ రాజ్ మరియు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల సామర్థ్య వృద్ధి, విధుల నిర్వహణలో చట్టపరమైన అవగాహన పెంపు లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహి స్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హాజరు పట్టిక పరిశీలనలో కొంతమంది ఉపసర్పంచులు, వార్డు సభ్యులు శిక్షణకు హాజరుకాలేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018ప్రకారం ప్రజాప్రతినిధులు ప్రభుత్వం లేదా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన బాధ్యత ఉన్నదని స్పష్టం చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశమున్నదని హెచ్చరించారు.శిక్షణకు హాజరుకాని వారు నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజులలోపు గైర్హాజరు కారణాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు. తక్షణమే శిక్షణకు హాజరు కావాలని సూచించారు. గడువులోగా సరైన వివరణ ఇవ్వకపోతే సంబంధిత వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ జిల్లా కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ నోటీసును అత్యవసరంగా పరిగణించాలని ఎంపీడీవో యుగంధర్ రెడ్డి సూచించారు.