30 June, 2026 | 1:21 AM

దేశంలో జెన్-జీ ఉద్యమం రాదు

30-06-2026 12:05 AM
  1. ఆందోళన చేయాలనే ఆలోచనలో వారు లేరు
  2. యువతే దేశానికి వెన్నెముక 
  3. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
  4. అవుషాపూర్ వీబీఐటీ కాలేజీ యూత్ కాన్‌క్లేవ్

ఘట్‌కేసర్, జూన్ 29 (విజయక్రాంతి): దేశంలో జెన్-జీ ఉద్యమం రాదని, యువత వారి ప్రొఫెషన్‌లో బిజీగా ఉన్నారని, ఆందోళన చేయాలనే ఆలోచనలో వారు లేరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని అవుషాపూర్‌లో ఉన్న విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో సోమవారం విద్యార్థులతో యూత్ కాన్‌క్లేవ్ (వికసిత్ భారత్ యువ సమ్మేళనం) జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నితిన్ నబిన్ హాజరై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కాన్‌క్లేవ్‌లో విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు నితిన్ నబిన్ ఓపికగా సమాధానాలు ఇచ్చారు. కెరీర్, దేశ భద్రత, రాజకీయాల్లో యువత భాగస్వామ్యం వంటి అనేక అంశాలపై చర్చించి వారిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా నితిన్ నబిన్ మాట్లాడుతూ.. నవభారత నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు.

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటోందని, విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల స్పష్టతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం కాకుండా, సమాజంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ సామాజిక బాధ్యతను, జాతీయ భావాలను, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.