13 May, 2026 | 2:12 AM

సేవతోనే నర్సులకు గుర్తింపు

13-05-2026 01:02 AM
  1. ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ శ్రీలక్ష్మి
  2. మెడికవర్ ఆసుపత్రిలో ఘనంగా నర్సింగ్ డే వేడుకలు

కరీంనగర్, మే 12(విజయక్రాంతి): నర్సులు తమ వృత్తిని ఉద్యోగంగా కాకుండా.. సేవగా భావించినప్పుడే గుర్తింపు వస్తుందని ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ శ్రీలక్ష్మి అన్నారు. వరల్ నర్సింగ్ డే సందర్భంగా మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీలక్ష్మి జ్యోతిప్రజ్వలన చేసి అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు. ఆరోగ్య వ్యవస్థలో నర్సుల పాత్ర అత్యంత కీలకమైందని చెప్పారు.

రోగుల సేవలో నర్సులు చూపే అంకితభావం, సహనం, మానవత్వం హాస్పిటల్‌కు మంచి పేరు తీసుకొస్తాయన్నారు. వైద్యులు చికిత్స అందిస్తే, ఆ చికిత్సను రోగికి సమర్థవంతంగా అందించే బాధ్యత నర్సులదేనని తెలిపారు. ప్రతి రోగిని కుటుంబ సభ్యుడిగా భావించి సేవలు అందించినప్పుడే నర్సింగ్ వృత్తికి మరింత గౌరవం పెరుగుతుందని ఆమె అభిప్రాయ

పడ్డారు. వేడుకల సందర్భంగా నర్సుల సేవలను కొనియాడుతూ పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు. నర్సులు ఆరోగ్య రంగానికి వెన్నెముకలుగా నిలుస్తూ రోగులు కోలుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. చివరగా నర్సింగ్ సిబ్బందికి సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినయ్, డాక్టర్ అనీష్, డాక్టర్ లోకేష్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ నయన, డాక్టర్ తాహా, డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ లావణ్య, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, హెచ్‌ఆర్ మేనేజర్ ఈశ్వర్, సీఎస్‌వో గౌస్బాబా తదితరులు పాల్గొన్నారు.