పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలియజేయాలి
కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 13వ తేదీలోగా గ్రామపంచాయతీ ఎన్నికల కొరకు పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్ లతో కలిసి గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అధికారులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే 2వ గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో 335 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో మొత్తం గ్రామపంచాయతీ వార్డులు 2 వేల 874 ఉన్నాయని, వార్డుల ఎన్నికల కొరకు సరిపడా సిబ్బంది వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు.
ముసాయిదా పోలింగ్ కేంద్రాల వివరాలను జిల్లాలో అన్ని గ్రామపంచాయతీలలో ఈ నెల 6న ప్రచురించడం జరిగిందని, ఈ నెల 12న అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు తగు సూచనలు అందించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 13వ తేదీ వరకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలని, పోలింగ్ కేంద్రాలలో అదే రోజున ఎన్నికల అనంతరం కౌంటింగ్ ఉంటుందని, సరైన వెలుతురు ఉండేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






