calender_icon.png 18 February, 2026 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాతనపల్లి మున్సిపల్ ప్రమాణ స్వీకార అడ్డంకి రాజ్యాంగ విరుద్ధం

18-02-2026 04:04:44 PM

- సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాదుని సుదర్శన్ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా  సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సిపిఐ మందమర్రి పట్టణ కార్యదర్శి కామెర దుర్గారాజ్ తో కలిసి మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 22 వార్డులకు గాను బిఆర్ఎస్, సిపిఐ పొత్తు 14 స్థానాల్లో విజయం సాధించి పూర్తి మెజారిటీ పొందిందని, కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచినప్పటికీ, మెజారిటీ ఉన్న తమను పీఠం దక్కనీయకుండా మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపి వంశీకృష్ణ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

అధికార యంత్రాంగం, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయడం అధికార దుర్వినియోగమని ధ్వజమెత్తారు. బంద్ పిలుపు నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తుంటే, సిపిఐ, బిఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం చేయడం సరికాదన్నారు. ప్రమాణ స్వీకార హాల్ ద్వారాలు మూసివేసి, మీడియాను అనుమతించకుండా మహిళా సభ్యులను వేధింపులకు గురి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక సిపిఐ నాయకులు ఆంటోని దినేష్ ఉప్పులేటి తిరుపతి గున్నాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు