20 May, 2026 | 2:45 AM

నిర్మాణానికి అడ్డు.. శిలాఫలకం ధ్వంసం

20-05-2026 01:35 AM

మొద్దు నిద్రలో టౌన్‌ప్లానింగ్ అధికారులు

కూకట్‌పల్లి, మే19(విజయక్రాంతి): తాము నిర్మించే అక్రమ షటర్ల నిర్మాణానికి అడ్డు వస్తుందని కొందరు నిర్మాణదారులు ఏకంగా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని వసంతనగర్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా షెటర్లు  ఏర్పాటు చేశా రు. ఇంత జరుగుతున్నా స్థానిక టౌన్‌ప్లానింగ్ అధికారులకు సమాచారం లేదా అంటే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.

అవినీతి అధికారులు అందిన కాడికి దండుకొని షెటర్ల నిర్మాణదారులకు సహకరిస్తు న్నారని ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై పలుమార్లు కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులకు కాలనీ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా 2007లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కబ్జాదారులు ధ్వంసం చేసినా ప్రభుత్వ అధికారులలో చలనం లేకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఇంత జరుగుతున్నా  టౌన్ ప్లానింగ్ అధికారులు సంఘటన స్థలానికి రాకపోవ డం పట్ల అనుమానాలు లేవనెత్తుతున్నారు.