నకిలీ పత్రాలతో భూమి అగ్రిమెంట్
కార్పొరేటర్ నరేంద్రకుమార్ రిమాండ్
మహేశ్వరం, జూన్14: నకిలీ పత్రాలను సృష్టించి తనకు సంబంధం లేని భూములను అగ్రిమెంట్ చేసి మోసం చేసిన మీర్‌పేట్ 13వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ అలియాస్ నందును పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నాళ్ల క్రితం నరేంద్రకుమార్‌కు చిత్తోజు కృష్ణతో పరిచయం ఏర్పడింది. తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని, అందులో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయని నమ్మించి చిత్తోజు కృష్ణ నుంచి నరేంద్రకుమార్ రూ.5 కోట్లు తీసుకున్నాడు.
మోసం చేయాలనే ఉద్దేశంతో కొంగర కలాన్‌లో గల 6.17ఎకరాల భూమిని తుమ్మల ధీరజ్‌రెడ్డి, తోట మాధవరెడ్డి, గుండు శ్రీకాంత్ పేరిట నకిలీ పత్రాలు సృష్టించి చిత్తోజు కృష్ణతో పాటు బొడ్డుపల్లి సతీష్‌కుమార్, నరేందర్‌కుమార్ అనే వ్యక్తులకు అగ్రిమెంట్ చేశాడు. అగ్రిమెంట్ సమయం దగ్గర పడడంతో వారు తరుచూ నరేంద్రకుమార్‌కు ప్రశ్నించగా వాయిదా వేస్తూ వచ్చాడు. అగ్రిమెంట్ చేసుకున్న వారు నేరుగా వెళ్లి భూమికి సంబంధించిన వివరాలు సేకరించగా అసలు విషయం బయటపడింది. నరేంద్రకుమార్‌కు చెందిన భూమి కాదని, ఇతరుల పొలం తనదిగా చూపించి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశాడని గ్రహించారు. దీంతో చిత్తోజు కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నరేంద్రకుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






