కాలమా గుర్తుంచుకో
06-04-2026 02:01 AM
కాలమా నీ పాదాల కింద
ఎన్ని కథలు పూడిపోయాయి?
నీ గడియారం మోగినప్పుడల్లా
ఎన్ని కలలే కాదు జీవితాలు ఛిద్రమయ్యాయి?
రైతు చెమట నీ ఎండలో ఆవిరికాలేదు..
అది రక్తమై నేలలో కలిసింది!
కూలీల బతుకు నగరాల్లో మాయ కాలేదు
అది కాంక్రీటు గోడల మధ్య బందీ అయింది
కాలమా.. నువ్వు ముందుకే పరుగెడతావు
కానీ, పడిపోయిన మనిషిని ఏనాడైనా
వెనక్కి తిరిగి చూసే ధైర్యం చేశావా?
గెలిచినవారి పేర్లు
నీ పుస్తకాల్లో బంగారు అక్షరాలు
ఓడిపోయినవారి బాధలు, కన్నీళ్లు
నీ నిశ్శబ్దంలోనే సమాధి
అందుకే అడుగుతున్నా
కాలమా.. నీ వేగం గొప్పదా?
మనిషి కన్నీటి విలువ గొప్పదా?
సమాధానం చెప్పకపోయినా ఫార్వాలేదు
కానీ, గుర్తుంచుకో..
ఒక్క కవి బతికితే సరిపోతుంది
ఈ లోకం చేసిన అన్యాయాన్ని అక్షరాలతో
కాల్చడానికి..
కవిత్వం ఉన్నంత వరకు మనిషి కథ ఎప్పటికీ
చావదు!
దుప్పటి మొగిలి




