30 July, 2026 | 9:59 PM

బీజేపీలో పాత-కొత్త పంచాయితీ

24-06-2024 01:33 AM

అధ్యక్ష పదవిపై నేతల చెరో మాట 

స్టేట్ బాస్‌గా ఫైటర్ ఉండాలన్న రాజాసింగ్

దమ్మున్నోడు పార్టీ అధ్యక్షుడు కావాలన్న ఈటల

సమయం కాదు సామర్థ్యాన్నే చూడాలన్న రఘునందన్

పార్టీ తీసుకునే నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైనట్లుగా కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై నేతలు చెరో మాట మాట్లాడుతూ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. కేంద్రమంత్రిగా, బీజేపీ అధ్యక్షునిగా జోడు పదవులను నిర్వహిస్తున్న కిషన్‌రెడ్డి తనకు అధ్యక్ష బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని అధిష్ఠానాన్ని కోరిన నేపథ్యంలో కొత్త బాస్ ఎవరనే అంశంపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది.

కేంద్రమంత్రి పదవులు ఆశించి భంగపడిన ఎంపీలు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు రేసులో ముందున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షునిగా ఫైటర్ ఉండాలని రాజాసింగ్ అంటుంటే, ఫైటర్ అవసరం లేదని దమ్మున్నోడైతే చాలని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎప్పుడు వచ్చామన్నది కాదని బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఉంటే చాలని మెదక్ ఎంపీ రఘునందన్ అన్నారు. ఇలా నేతలు తలో మాట మాట్లాడుతున్న వేళ అసలు బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కాక పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ బీజేపీలో పాత, కొత్త పంచాయితీ మొదలైంది.

వీధి పోరాటాలు చేయాలా?

ఈటలను అధ్యక్షునిగా నియమిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో సంచలనంగా మారింది. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా నియమించాలని కోరారు. ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ పెరిగిందని, సరైన వ్యక్తి అధ్యక్షునిగా రావాలని అధిష్ఠానాన్ని కోరుతానని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కొత్త అధ్యక్షున్ని నియమించాలని రాజాసింగ్ స్పష్టం చేశారు. అగ్రెసివ్‌గా ఉన్న వ్యక్తి, ఫైటర్ లాంటి వారు అధ్యక్షుడు కావాలని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దీనికి ఎంపీ ఈటల సైతం కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షుడు స్ట్రీట్ ఫైటర్ కావాలా? వీధి పోరాటాలు చేయాలా? అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టేవాడు కావాలని ఈటల వ్యాఖ్యానించారు.

అధికారంతో విర్రవీగే వారితో పోరాడిన వాళ్లు గొప్ప వాళ్లని అన్నారు. సందర్భం వస్తే జేజమ్మతో కూడా కొట్లాడే ధైర్యం తనకు ఉందన్నారు. ఇప్పటికే ఐదుగురు సీఎంలతో కొట్లాడానని, బీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్‌తోనూ అదేవిధంగా పోరాడి పార్టీని వీడినట్లుగా ఈటల చెప్పుకొచ్చారు. ఈటల వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కచ్చితంగా పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారని, అధిష్ఠానం సైతం ఆయన పట్ల మొగ్గు చూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. లేదంటే అంతటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తనకు కచ్చితంగా పదవి ఖాయమవడం వల్లే రాజాసింగ్‌కు బహిరంగంగా కౌంటర్ ఇచ్చినట్లు పార్టీ నేతలు కొందరు పేర్కొంటున్నారు. 

బీసీకే అవకాశం!

బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలు, కొత్తగా వచ్చిన వారికి మధ్య అధ్యక్ష పదవి కోసం ఫైట్ నడుస్తోంది. బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉండగా పార్టీ అధ్యక్షునిగా కచ్చితంగా బీసీ నేతనే నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటల రాజేందర్‌కే అధ్యక్షునిగా అవకాశం లభిస్తుందని విశ్వసనీయ సమాచారం. మరోవైపు మరో బీసీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం పోటీ పడుతుండగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటలకే ఎక్కువ చాన్స్ ఉందని అంటున్నారు.

రాష్ట్రంలో బీజేపీ మంచి స్వింగ్‌లో ఉండటంతో పార్టీ అధ్యక్ష పదవికి క్రేజ్ పెరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని గట్టిగా ముందుకు నడిపిస్తే సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేనంటే నేనూ అని నేతలు పోటీ పడుతున్నారు. పార్టీలో ఎప్పుడు లేని విధంగా నేతల మధ్య మాటల యుద్ధంపైనా పార్టీ సైతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరగా నూతన అధ్యక్షున్ని నియమించి ఈ ఎపిసోడ్‌ను ఇక్కడితో ముగించాలని అధిష్ఠానం భావిస్తోందని పార్టీ నేతలు తెలిపారు.

కొత్తోళ్లు ఎందుకు కాకూడదు?

మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి. నిన్న జాయిన్ అయ్యారు, మొన్న జాయిన్ అయ్యారని ఏమీ ఉండదని, పార్టీని నడిపిస్తారని అధిష్ఠానం భావిస్తే వారికే కచ్చితంగా అవకాశం దక్కుతుందని పేర్కొనడం చూస్తే తమకు కూడా అవకాశం ఉందని చెప్పకనే చెప్పినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన హేమంత బిశ్వశర్మను అసోం సీఎంగా చేసిన అంశాన్ని సైతం రఘునందన్ ఉదహరించారు. అంటే రాజాసింగ్ వ్యాఖ్యలతో ఆయన విభేదించినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పార్టీకి చెందిన కొందరు నేతలంటున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదు సామర్థ్యాన్ని బట్టి పదవులని అంటున్న రఘునందన్ వ్యాఖ్యలు తాను సైతం బరిలో ఉన్నట్లుగా సందేశాన్ని పంపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.