పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
- ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్
నిర్మల్,(విజయక్రాంతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, మేనిఫెస్టో హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం స్థానిక ఎస్టీయూ భవన్ లో సంఘ జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో "టీచర్లకు జీతాలు ఎక్కువగా ఉన్నాయి" అనే అంశాన్ని చేర్చడం అత్యంత విడ్డూరమని అన్నారు. నివేదికలో అనేక అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని వాటిపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడేళ్ళుగా పీఆర్సీ, నాలుగు డిఏలు, పెండింగ్ బిల్లులు లేక ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హెల్త్ కార్డులపై వెంటనే జీవో జారీ చేయాలని, అన్ని రకాల గురుకుల, కెజిబివి, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. టెట్ ఉత్తీర్ణత మార్కుల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో కొత్తగా అప్గ్రేడ్ అయిన పాఠశాలలకు ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో విశిష్ఠ అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలపై ఎస్టీయూ చేస్తున్న కృషిని కొనియాడారు. పట్టణాభివృద్ధి కి అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్ నాయకులు బి. గోవింద్ నాయక్, పల్సీకర్ శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్, కౌన్సిలర్ లు ఎస్. పి. రాజు, పోశెట్టి వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.




