8 July, 2026 | 1:05 AM

60 గజాల ఇళ్ల స్థలాల సమస్యపై వినతి

08-07-2026 12:09 AM
  1. బాధితులకు న్యాయం చేస్తామని హామీ..  
  2. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు

మొయినాబాద్, జూలై 7 (విజయ క్రాంతి): హిమాయత్నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 151లో 60 గజాల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ ప్రతినిధులు, బాధితులు మంగళవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. హిమాయత్నగర్ గ్రామ మాజీ సర్పంచ్ పల్లగోల్ల మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు షాబాద్ దాస్, వజీర్తో పాటు గ్రామస్తులు మంత్రిని కలిసి పేదలకు కేటాయించిన 60 గజాల ఇళ్ల స్థలాలను వెంటనే చూపించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై స్పందించిన మంత్రి శ్రీధర్బాబు వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడి 60 గజాల ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన సమస్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి, పేదలు త్వరలోనే ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు మంత్రి హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు.