ఆలేటివాగు ఒడ్డున..
- ప్రాచీన మానవుల అనువైన ఆవాసం
- నేటి రంగనాయకుల గుడి నాటి జైనాలయం
- నల్లగుట్ట రాళ్ల నుంచే శాసనాల తయారీ
* పాతరాతియుగం జాడలు లభించిన ఆలేటివాగు, ఈ(ఏ)దులవాగుల ఒడ్డున ఉన్న ప్రాచీన మానవ ఆవాసం ఆలేరు. చుట్టూ పరుపుబండల గుట్టలు, ఏనెలు, నీటిజలాలు ఎక్కువగా ఉన్నందున ప్రాచీనమానవులకు అనువైన ఆవాసంగా మారింది. ప్రస్తుతం యాదాద్రి -భువనగిరి జిల్లాలోని నియోజకవర్గ, మండల కేంద్రంగా జాతీయ రహదారిలో ఉన్నదే ఆలేరు పట్టణం.
ఆలేరువాగుకు అవతలి ఒడ్డునున్న సాయిగూడెంలో ఉన్న నల్లగుట్ట వారికి కావలసిన రాతిపనిముట్లనిచ్చింది. ఆ గుట్టే తర్వాత మధ్యయుగ చారిత్రక కాలాల్లో శాసనాలకు కావలసిన రాళ్లనిచ్చింది. రాష్ట్రకూటుల పాలనలో 20వేల నాడుకు రాజధానిగా ఉన్న కొలనుపాకకు పొరుగుగ్రామం ఆలేరు. కొలనుపాక చుట్టు ఉన్న గ్రామాలు రాజ్యానికి అవసరమైన సైన్యాలకు, వృత్తుల వారికి నెలవైనవని ఆయా గ్రామాల పేర్లు చెపుతున్నాయని నాకు చరిత్రగురువైన విరువంటి గోపాలకృష్ణ గారు చెప్పారు.
ఆలేరుకు పక్కన ఉన్న సాయిగూడెం ‘సాహిణిగూడెమ’ని (అశ్వసైన్యానికి విడిది), మందనపల్లి ‘మందడుల’దని, బంటుగూడెం (ఇపుడు శ్రీనివాసపురం) కాల్బంటులదని, కాచారం ఇనుము తయారీ కేంద్రమని, యాసోజుగూడెం వడ్రంగులదని గ్రామనామాలను విశ్లేషించి చెప్పారు.
అట్లే ఆలేరులో ప్రస్తుతం రంగనాయకులగుడిగా వున్న దేవాలయం ఒకప్పుడు జైనాలయమని చెప్పడానికి ముఖమంటపం మీద జైనమునుల శిల్పాలు సాక్ష్యమిచ్చేవి. కొత్తగుడి కట్టడానికి పాత నిర్మాణాలను పూర్తిగా తొలగించి, గుడిచుట్టూ భరంతీగా నింపి, పైన బండలు పరిచారు. దేవాలయ నిర్మాణం సిద్ధిపేట జిల్లా దుద్దెడ దేవాలయాన్ని పోలివుంటుంది. దుద్దెడగుడి కూడా ఒకప్పుడు జైనదేవాలయమే. అక్కడ జైన పార్శ్వనాథ విగ్రహం ఇప్పటికి వుంది.
గుడికో చరిత్ర.. భిన్నమైన శిల్పాలు
ఆలేరులో పాత శివాలయం, చండికాంబగుడి, పోచమ్మగుడి, బీరప్పగుడి, నీలదేవమ్మ గుడి, ఆంజనేయుని గుళ్లు, 35మంది అమ్మదేవతల గుడులున్నాయి. ఒక్కొక్క గుడికొక చరిత్ర...భిన్నమైన శిల్పాలున్నాయి. ఆలేరులో కళ్యాణి చాళుక్యుల కాలంలో వేసిన శాసనం కూడా దొరికింది. చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవ మహారాజు, ఆలేరు-40 కంపనం పాలకుడు సవదొరె(రాజరక్షకుడు) సౌధరి,చౌదరి సోమనాయకుడు, వేమిరడి, బూదిరడిల పేర్లు పేర్కొనబడ్డాయి.
ఊరిలో పోచమ్మగుడి ముందర బాటబురుజు
ఆలేరు గ్రామాన్ని పొందించిన పద్ధతిని పరిశీలిస్తే ప్రస్తుత రంగనాయకదేవాలయం కేంద్రంగా, గుడికి పడమరన విశ్వబ్రాహ్మణుల వాడ, నైరుతిలో సౌధరుల ఇండ్లు, ఉత్తరాన కుమ్మరులు, పోచమ్మకుంట ముందర రెడ్లు, వారి వెనకాల మంగలివాడ, వారికివతల మున్నూరు కాపు వారిండ్లు, కొంచెం అవతల కోమట్ల ఇండ్లు, సౌధరుల ఇండ్ల వెనక పడమరలో గౌండ్లవారిండ్లు, గొల్లవారిండ్ల వెనక సాలెల ఇండ్లు, వారికి పడమరగా గొల్ల, కురుమల ఇండ్లు వారికి పడమరలో చాకలివాండ్ల ఇండ్లు, పోచమ్మకుంట అవతలి ఒడ్డున మాలవారిండ్లు, మొత్తం వూరికి వాయవ్యంలో మాదిగల ఇండ్లు, రంగనాయక దేవాలయానికి దక్షిణంగా గాండ్ల(గానుగలవారు) వారిండ్లు ఉంండేవి 50యేండ్ల కిందదాక. మిగతా కులాలవాళ్లు గ్రామానికి ఉత్తరం అంచులో వుండేవారు. ఊరిలో పోచమ్మగుడి ముందర బాటబురుజు ఉండేదట.
పోచమ్మగుడిలో 3 చాముండ దేవతల శిల్పాలున్నాయి. వాటి మధ్యన సుఖాసనంలో వున్న ఒక పురుషశిల్పం వుంది. ఆ శిల్పానికి రెండుచేతులు, కుడిచేతిలో ఫలమో, లింగమో వుంది. రెండవ చేతిలో వున్నది పుస్తకరూపంలో ఆయుధమా తెలియడంలేదు. తలపైన కొప్పుముడి.. మెడలో కంఠహారాలున్నాయి. పాశుపతాచార్యుడు కావచ్చని డా. ఈమని శివనాగిరెడ్డి గారన్నారు. రెండవది నీలదేవమ్మ గుడిలో వున్న పలక శిల్పాలు. చిన్న రాతిఫలక మీద గీతలలో చెక్కిన జంటదేవతల శిల్పం ఎవరిదో గుర్తించవీలుకాలేదు.
చండికాలయంలో రాష్ట్రకూటుల కాలం నాటి శిల్పాలు
చండికాలయంలో పశ్చిమాభిముఖంగా కాయోత్సర్గభంగిమలో ఉన్న పార్వతి, ఉత్తరంవైపు సూర్యుడు, దక్షిణంవైపు వినాయకుడు వున్నారు. దేవాలయ ప్రాంగణంలో భైరవుడు, చిన్న శివలింగాలు, నంది శిల్పాలున్నాయి. రంగనాయకునిగుడిలో 12అడుగుల పొడవు 4అడుగుల ఎత్తున్న భోగశయనుడి విగ్రహం వుంది. గుడిలో విడిగా తెచ్చిపెట్టిన ఆళ్వారుల విగ్రహాలున్నాయి. దేవాలయ ద్వారం దక్షిణాభిముఖంగా వుంది. పాతశివాలయంలో బాణలింగముంది. రాష్ట్రకూటుల కాలంనాటి వినాయకశిల్పం వున్నాయి.
శ్రీరామోజు హరగోపాల్




