09-11-2025 12:09:38 AM
శిథిలమవుతున్న వెయ్యేళ్ల సూర్యదేవాలయం
* వెయ్యేళ్ల చరిత్ర కలిగిన కాకతీయ యుగ కట్టడం ఇప్పుడు చెట్ల పొదల్లో కరిగిపోతోంది. గుప్తనిధుల వేటలో దుండగులు తవ్వకాలు జరిపి విగ్రహాలను ధ్వంసం చేయడంతో ఆలయం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఎన్నోసార్లు దేవాదాయ శాఖకు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. దీప నైవేద్యాలకు నోచక ఆలయం శిథిలమైపోతోంది.
గడగోజు రవీంద్రాచారి, నకిరేకల్, -విజయక్రాంతి : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని ఈ వెయ్యేళ్ల సూర్య దేవాలయం చోళ, కాకతీయ, శాతవాహనుల, విష్ణుకుండుల శిల్పకళల సమ్మేళనంగా నిలిచింది. తెలంగాణలో పురాతన, అరుదైన సూర్య దేవాలయాల్లో ఒకటైన ఈ ఆలయం, సరైన పరిరక్షణ లేక చెట్ల పొదల్లో మునిగిపోయింది. అర్కవరం (సూర్యుని స్థలం) అనే ప్రాచీన పేరునుండే ఆకారంగా రూపాంతరం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు.
శిలాశాసనాలు చెబుతున్న గాథ
గ్రామ చెరువు ఆగ్నేయంలో సూర్య దేవాలయం, ఉత్తరంలో శివాలయం నిర్మించబడ్డాయి. ఆలయ స్తంభాలపై చెక్కిన పూర్ణకుంభాలు, తామరపువ్వులు, ఎక్కడా లేని శ్రీచక్రం, శిలా శాసనం ఇవన్నీ ఆ కాలపు శిల్పకళా నైపుణ్యానికి సాక్ష్యాలు. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో గర్భగుడి ద్వారం గుండా కిరణాలు నేరుగా విగ్రహంపై పడే విధంగా నిర్మాణం జరగిందని పురావస్తు నిపుణులు భావిస్తున్నారు.
కూలిపోతున్న వారసత్వం
కాలక్రమంలో నిర్లక్ష్యంతో ఆలయం కూలిపోయే దశలో ఉన్నది. గుప్తనిధుల వేటలో దుండగులు తవ్వకాలు జరిపి విగ్రహాలను దోచుకెళ్లారు. 2014లో సూర్యనారాయణ స్వామి ఐదు అడుగుల విగ్రహం దొంగతనానికి గురైంది. గణేష్ , నంది, విష్ణు విగ్రహాలు ధ్వంసానికి గురయ్యాయి. పిటిషన్లు ఇచ్చినా అధికారులు స్పందించ లేదు. ఆలయానికి చెందిన 47.07 ఎకరాల భూమి ఉందని సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. అక్రమంగా కొంతమంది బదిలీ చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ దేవాదాయ, రెవెన్యూ అధికారులు మాత్రం రికార్డుల్లో దేవుని పేరిట ఎలాంటి భూమిలేదని తెలుపుతున్నారు.
పునరుద్ధరణకు ఆగిపోయిన ప్రయత్నాలు
గతంలో తెలుగు,ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడిన తరువాత అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ విచారణకు ఆదేశించారు. అధికారులు రూ.5 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు అధికారులు చెప్పారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం, దొంగిలించిన విగ్రహాల కోసం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నాలు కూడా సఫలం కాని పరిస్థితి. దేవాదాయ అధికారులకు, పోలీస్ ఉన్నత అధికారులకు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ప్రజల ఆరోపిస్తున్నారు.
చరిత్రకారులు, పురావస్తు నిపుణులు, శాస్త్రవేత్తలు గతంలో సంయుక్తంగా పరిశోధన చేసి, ప్రాచీన కట్టడాలను చరిత్రను శిల్పాల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కొంత ప్రయత్నం చేశారు. పురావస్తు, దేవాదాయ శాఖల సమన్వయం కూడా లేదనిపిస్తుంది. కాగా, ప్రాచీన శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయాన్ని రక్షించి, పునర్నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.