03-12-2025 04:43:28 PM
శ్రీ సరస్వతీ శిశు మందిర్ కొత్తగూడెంకు రూ.1 లక్ష అందజేత
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యా దానం విశ్వవర్ధనమై వర్ధిల్లాలని భావించిన ఖమ్మం విభాగ్ అధ్యక్షులు దేవకీ వాసుదేవ రావు బుధవారం కొత్తగూడెం శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల అభివృద్ధికి రూ.1 లక్ష విరాళాన్ని అందజేశారు. మానవ విజ్ఞానానికి విశ్వరూపమే చదువన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించుటలో శిశు మందిరాలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయన్నారు. విద్యాసంస్కర్తలు, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉన్న విద్యార్థుల భవితవ్యానికి పాఠశాల వారీగా గుర్తించి స్కాలర్షిప్లు ప్రకటించే దిశగా సంఘసంస్కర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించే దిశగా పాఠశాల ఆచార్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు. మాతృభాషలో విద్యార్థి మాట్లాడినట్లుగా, హిందీ ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం వచ్చే విధంగా ఆచార్యులు ప్రాథమిక తరగతుల స్థాయి నుండి కృషి చేయాలని ఆయన ఆచార్యులకు సూచించారు. విద్యార్థులకు విద్యాధనం విశ్వ వర్ధనమై వర్ధిల్లాలని, ఆ దిశగా ఆచార్యులు కృషి చేయాలని ఆయన ఆచార్యులకు సూచించారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రబంధకారిణి కమిటీ, పాఠశాల ప్రధానాచార్యులు స్రవంతి, ఆచార్యులు, అభినందనలు తెలియజేశారు.