కొత్త పెన్షన్ల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి, ఆగస్టు 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం2026 కింద అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్, బ్యానర్, కరపత్రాలను శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాండు, జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్డీఏ అదనపు పీడీ సూర్యారావుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రక్త సంబంధిత దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్లను అందిస్తోందన్నారు. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వ్యాధులతో బాధపడుతున్న రక్త సంబంధిత దివ్యాంగులు, కల్లుగీతా కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు సంబంధిత ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అర్హులైన వారు సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు/మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి వితంతువు, ఒంటరి మహిళకు దరఖాస్తు చేసుకునే విధంగా మహిళా సమాఖ్యల సహకారంతో దరఖాస్తు ప్రక్రియ మరియు అవసరమైన ధృవపత్రాల విషయంలో సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హులైన వారు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాండు కోరారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ప్రయోజనం అందేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.






