సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి
జూబ్లీహిల్స్, మే 23 (విజయక్రాంతి): ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి సూచించారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ మానర్ అపార్ట్‌మెంట్, ప్రగతినగర్, శ్రీనగర్ కాలనీవాసులకు సైబర్ నేరాల తీరుతెన్నులు, వాటి నుంచి జాగ్రత్తగా ఉండడం గురించి శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. ముఖ్యంగా పెట్టుబడులు, గిఫ్ట్‌లు, ఓటీపీల పేరిట ప్రజల సొమ్మును సైబర్ నేరస్తులు కాజేస్తున్నారన్నారు.
పిల్లలు, పెద్దలు అందరూ వాటి వలలో చిక్కి బ్యాంకు ఖాతాలో డబ్బును కోల్పోతున్నారని వివరించారు. ఫోన్ల ద్వారా తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పొద్దని, అనుమానాస్పద వెబ్ లింకులను క్లిక్ చేయొద్దని కోరారు. ప్రత్యేక ఆఫర్ల పేరిట బురిడీ కొట్టించే వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల స్వతహాగా అవగాహన పెంచుకోవడమే కాకుండా, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మధురానగర్ పోలీసు స్టేషన్ ఇన్స్‌పెక్టర్ హెచ్.ప్రభాకర్, సైబర్ వారియర్ ఎస్‌ఐ భానుచందర్, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






