సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు
తాడ్వాయి, ఆగష్టు,10( విజయ క్రాంతి ): ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో సోమవారం ఆయన సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు ఫోన్లో ఓటిపి వచ్చిందని ఓటిపి చెప్పాలని కోరితే చెప్పవద్దని సూచించారు.
వేరే వివరాలు అడిగిన ఎలాంటి వివరాలు చెప్పవద్దన్నారు.ఫోన్ లో ఏవైనా కొత్త యాప్ లు వచ్చినప్పుడు వాటిని పూర్తిగా పరిశీలించకుండా ఓపెన్ చేయవద్దని సూచించారు. గ్రామాల్లో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైనా గ్రామానికి కొత్త వ్యక్తులు వచ్చిన సమయంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, ఎస్త్స్ర నరేష్, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






