31 July, 2026 | 12:47 AM

వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

31-07-2026 12:08 AM

జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సుధీర్

వెంకటాపూర్, జులై 30 (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సుధీర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాలంపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లను ఆయన తనిఖీ చేసి పీహెచ్సీ రికార్డులు, ల్యాబ్, రిజిస్టర్లను పరిశీలించారు.

జ్వరంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి నుంచి రక్త నమూనాలు సేకరించి మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. గుత్తికోయ గూడాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ఆశా కార్యకర్తల రిజిస్టర్లను పరిశీలించిన ఆయన, ఇంటింటి సర్వే నిర్వహించి జ్వర బాధితులను గుర్తించాలని, ప్రజలకు నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పించాలని తెలిపారు. వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే గ్రామాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు డా. పాషా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ భవ్య, స్టాఫ్ నర్సులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.