వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
- కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి
- ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి టౌన్, జులై 31 (విజయక్రాంతి): వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిం చాలని కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అన్నారు. జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు కర్తవ్యనిబద్ధతతో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ అధికారుల సంఘం ఆధ్వ ర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అధికారులను అభినందించి, వారి సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం అత్యంత బాధ్యతాయుతమైనదని, కుటుంబానికి దూ రంగా ఉండి ప్రజల భద్రత కోసం అంకితభావంతో సేవలందించడం పోలీస్ సిబ్బంది గొప్పతనమని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిడులు, సవాళ్లు ఎదురైనా వాటిని సమర్థవంతంగా అధిగమించి సేవలందించిన రిటైర్డ్ అధికారుల సేవలు పోలీస్ శాఖ కు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
సన్మానం పొందిన అధికారులు...
ఎండి.ఫజల్ ఉల్లా ఖాన్ ఎస్‌ఐ, షీ టీం, భూపాలపల్లి జిల్లా, జే. సమ్మిరెడ్డి ఏఎస్‌ఐ, గణపురం పోలీస్ స్టేషన్, ఎస్.ఉపేందర్ ఏఆర్‌ఎస్‌ఐ, భూపాలపల్లి హెడ్క్వార్టర్స్.
శాలువాతో సన్మానించిన ఎస్‌పీ..
ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి వారి విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ రత్నం, రిటైర్డ్ అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.






